వైద్యసిబ్బందిని ప్రభుత్వం ఆదుకుంటుంది..
Ens Balu
3
Kakinada
2021-06-16 12:19:40
కరోనా వైరస్ బారినపడి మరణించిన వైద్య, ఆరోగ్య సిబ్బంది కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాచరణను అమలుచేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన డాక్టర్ కందికట్ల రోజి ఏలూరులోని ఆశ్రమ్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసి, అక్కడే హౌస్ సర్జన్ చేస్తూ కోవిడ్ రోగులకు సేవలందిస్తూ వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత మోరిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి జూన్ 1వ తేదీన మరణించారు. కోవిడ్ బాధితుల ప్రాణాలను కాపాడే క్రమంలో అదే వైరస్ బారినపడి మరణించిన రోజి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రోజి సోదరుడు రాకేశ్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద రూ.25 లక్షల చెక్కును బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాన్య ప్రజలతో పాటు వైద్య, ఆరోగ్య; పోలీస్, రెవెన్యూ ఇలా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది వైరస్ బారినపడుతున్నారని, దురదృష్టవశాత్తు కొందరు మరణిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ప్రత్యక్షంగా రోగులకు వైద్య సేవలు అందించే క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది వైరస్ బారినపడుతున్నారని, వీరిలో కొందరు మరణించడం విచారకరమన్నారు. ఇలా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ, బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆర్థికంగా బలహీనంగా ఉన్న డా. రోజి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించినట్లు కలెక్టర్ వివరించారు.
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు: కందికట్ల రాకేశ్:
కార్యక్రమం సందర్భంగా వైద్యురాలు రోజి సోదరుడు రాకేశ్ మాట్లాడుతూ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించి మా కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లోనే కలెక్టర్ చేతుల మీదుగా రూ.25 లక్షల ఆర్థిక సహకారాన్ని అందేలా చేశారని పేర్కొన్నారు. కోవిడ్ విభాగంలో విధులు నిర్వహిస్తూ వైరస్ బారినపడిన చెల్లెమ్మ రోజి కోవిడ్‌తో పోరాడి మరణించినట్లు రాకేశ్ వెల్లడించారు. 2006లో తండ్రి మరణించారని, ఇప్పుడు సోదరి మరణం తీవ్ర ఆవేదనను మిగిల్చిందన్నారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, అధికారులు, సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డా. జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.