భూరక్షణ పథకంతో రైతులకి మేలు..


Ens Balu
3
Duggirala
2021-06-19 14:18:51

వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పధకంతో రైతులకు మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా- రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, దేవరపల్లి అగ్రహారం గ్రామంలోని భూముల రీసర్వే కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా- రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 114 ఏళ్ళ క్రితం బ్రిటీషు వారి పాలనలో  భూములను సర్వే చేశారన్నారు. ప్రస్తుతం రైతుల పొలాల హద్దుల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని భూములను రీసర్వే చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లాలో భూముల రీసర్వేపై ఫైలెట్ ప్రాజెక్ట్ కింద దేవరపల్లి అగ్రహారం గ్రామాన్ని తీసుకోవడం జరిగింద న్నారు. ఈ గ్రామ రైతులు భూముల రీసర్వే ఫైలెట్ ప్రాజెక్ట్ కార్యక్రమానికి  సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో మొత్తం 165 ఎకరాల పొలం ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలిపారు. ప్రభుత్వ భూమి సుమారు 20 ఎకరాల మేరకు కెనాల్ రహదారులు, డొంక, స్మశాన వాటిక భూములు  ఉన్నాయన్నారు. గ్రామ కంఠం కింద 2ఎకరాల 50 శెంట్లు, రైల్వే లైనుకింద 08.94 ఎకరాలు, ఆర్ అండ్ బి రహదారులకు 03.21 ఎకరాలు ఉన్నాయని అన్నారు.  గ్రామ హద్దుల కింద 53 రాళ్ళను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల కింద 55 హద్దు రాళ్ళను వేసినట్లు పేర్కొన్నారు. గ్రామ కంఠం కింద 10 రాళ్ళు వేశారన్నారు. ఈ గ్రామంలో మొత్తం 75 ఇల్లు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమానికి తరలివచ్చిన రైతులు కొందరు స్థానికంగా ఉన్న సమస్యలను జిల్లా సంయుక్త కలెక్టర్ ( రైతుభరోసా- రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో  డిప్యూటి కలెక్టర్ కె.ఆర్.ఆర్.సి ప్రాజెక్ట్ అధికారి టి.భాస్కరనాయుడు, దుర్గిరాల తహాశీల్ధారు కె. మల్లేశ్వరి, డిప్యూటి సర్వేయర్ టి.శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

సిఫార్సు