రైతులకు సాగునీరు అందాలి..
Ens Balu
3
Narasannapeta
2021-06-23 13:39:44
రైతులకు సాగునీరు సక్రమంగా అందేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. సాగునీటి కాలువలకు భంగం కలగరాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సాగునీటి పారుదలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని కలెక్టర్ శ్రీకేష్ అన్నారు. బుధవారం నరసన్నపేట మండలం పోతయ్య వలస వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సాగునీటి కాలువలను ఆయన పరిశీలించారు. ఇందులో భాగంగా నరసన్నపేట మండలం దేసవానిపేట, పోలాకి మండలం దీర్ఘశీ, డోల తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. ఇటీవల కోమర్తి నీటి సంఘం మాజీ అధ్యక్షుడు కనపల శేఖర్ రావు సాగునీటి కాలువల సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వంశధార ఎస్ఇ డోల తిరుమలరావు కు ఆదేశించారు. ముఖ్యంగా సాగునీటి కాలువలకు అందుతున్న నీటిని అడ్డుకునేందుకు ఎవరికీ హక్కు లేదని జాతీయ రహదారి పనులలో ఇవి ఆటంకంగా ఉన్నట్లయితే ముందుగా సంబంధిత అధికారులకు తెలియ చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఏదేమైనా ఈ ఏడాది ఖరీఫ్ కు సాగునీరు అందేటట్లు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.