నిర్మాణ పనులు సత్వరమే పూర్తిచేయాలి..
Ens Balu
3
Vizianagaram
2021-06-24 10:18:59
ఉపాధి నిధుల అనుసంధానంతో గ్రామాల్లో చేపట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణాలను సత్వరమే పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు మండల స్థాయి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా జె.సి. జె.వెంకటరావు గురువారం కొత్తవలస మండలంలోని వీరభద్రపురం, వియ్యంపేట, తుమికాపల్లి, కాటకాపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామాల్లో నిర్మాణంలో వున్న గ్రామ సచివాలయాలు, వెల్ నెస్ సెంటర్లు, రైతుభరోసా కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ భవనాలను మండలస్థాయి అధికారులతో కలసి పరిశీలించారు. వాటి నిర్మాణ పరిస్థితులను, ఎప్పటికి పూర్తవుతాయనే అంశాలపై చర్చించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా భవన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలని, అదే సమయంలో భవన నిర్మాణాల్లో నాణ్యత విషయంలో రాజీలేకుండా వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు భవన నిర్మాణ పక్షోత్సవాలు ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే గ్రామాల్లో పర్యటించి వాటి ప్రగతిని సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ పర్యటనలో తహశీల్దార్ ఎస్.రమణ, మండల ఇంజనీరింగ్ అధికారి, ఇ.ఓ.పి.ఆర్.డి తదితరులు పాల్గొన్నారు.