భవన నిర్మాణ పక్షోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే డా. సత్తిసూర్యనారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ (గృహ నిర్మాణం) ఎ.భార్గవ్ తేజ తదితరులతో కలిసి బిక్కవోలులో రూ.25 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయం-1, రూ.40 లక్షలు ఖర్చుతో నిర్మించిన గ్రామ సచివాలయం-3 భవనాలకు కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందితో మాట్లాడి.. విధుల నిర్వహణకు శాశ్వత భవనాలు అందుబాటులోకి వచ్చినందున మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చాలా కీలకైన రెండు ముఖ్య భవనాలకు నేడు ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఈ జిల్లాలోని కరపలో 2019, అక్టోబర్ 2న తొలి గ్రామ సచివాలయాన్నిప్రారంభించారని, అప్పటి నుంచి సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు. సిబ్బందితో పాటు ప్రజలకు ఉపయోగపడేలా శాశ్వత భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బల్క్ మిల్క్ యూనిట్లు తదితరాలకు కూడా శాశ్వత భవనాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డా. సత్తిసూర్యనారాయణరెడ్డి కృషితో భవనాల నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్, రామచంద్రాపురం ఆర్‌డీవో పి. సింధు సుబ్రహ్మణ్యం, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, బిక్కవోలు సర్పంచ్ సరెళ్ల సుమలత, తహసీల్దార్ కె.వెంకట మాధవరావు తదితరులు పాల్గొన్నారు.