విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలం నెలివాడ వద్ద నిర్మాణంలో జిల్లాస్థాయి ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ నిర్మాణాన్ని జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ గురువారం పరిశీలించారు. రూ.3.63 కోట్ల వ్యయంతో రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దీని నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఈ భవన నిర్మాణం ఎలివేషన్‌కు సంబంధించి కొన్ని సమస్యలు ఏర్పడటంతో ఇటీవలి కాలంలో నిర్మాణం పనులు నిలిచిపోయాయి. వాటిని పరిష్కరించి ల్యాబ్ నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసే లక్ష్యంతో శుక్రవారం జాయింట్ కలెక్టర్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఏపి పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీర్లు, వ్యవసాయ అధికారులతో తన ఛాంబరులో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జె.సి. డా.కిషోర్ కుమార్ గురువారం నిర్మాణంలో ఉన్న ల్యాబ్ భవనాన్ని పరిశీలించారు. ల్యాబ్ నిర్మాణం పనులు దాదాపు 65 శాతం వరకు పూర్తయ్యాయని వ్యవసాయ శాఖ ఏ.డి. మహరాజన్ జె.సి.కి వివరించారు. ఈ పర్యటనలో భాగంగా బొండపల్లి మండలంలో కనిమెరక, బొండపల్లిలో నిర్మాణంలో ఉన్న రైతుభరోసా కేంద్రాలను జాయింట్ కలెక్టర్ డా.కిషోర్ కుమార్ పరిశీలించారు. జూలై 8న ఈ భవనాలను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారి రవీంద్రను ఆదేశించారు.