గుంకలాం లేఅవుట్‌లోని జగనన్న కాలనీని మోడల్ టౌన్‌షిప్‌గా తీర్చిదిద్దుతామని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. లబ్దిదారులను చైతన్యవంతం చేసి, త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ, ప్రతీ పేదవాడికీ సొంతింటి కలను నెరవేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో భాగంగానే రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. గుంకలాం లేఅవుట్‌లో డిసెంబరు 30న గౌరవ ముఖ్యమంత్రి చేతులమీదుగా పట్టాలు పంపిణీ ప్రారంభించడం అదృష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేవుట్‌గా సుమారు 397 ఎకరాల్లో, 12,302 మందికి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలనూ కల్పించి, మోడల్ టౌన్ షిప్‌గా అభివృద్ది చేస్తామన్నారు. ఈ లేఅవుట్‌లో మొత్తం 129 బోర్లను తవ్వించి, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటిని సరఫరా చేస్తామన్నారు. రెండుమూడు రోజుల్లో విద్యుత్ సదుపాయం కల్పించి, మోటార్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో 2004-09 మధ్య తాను శాసనసభ్యునిగా ఉన్న సమయంలో, వైఎస్ఆర్ నగర్‌లో 3,200 ఇళ్లతో లేఅవుట్‌ను అభివృద్ది చేశామని చెప్పారు. గుంకలాం లేఅవుట్ లోని జగనన్న కాలనీ కూడా భవిష్యత్తులో ఒక పెద్ద నగరంగా అభివృద్ది చెందుతుందని, దీనికోసం ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. ఇవి కాకుండా కొండకరకాం, సారిక, జమ్మునారాయణపురం వద్ద కూడా జగనన్న కాలనీలను అభివృధ్ది చేస్తామని, నియోజకవర్గం మొత్తంమీద సుమారు 20వేల ఇళ్లు నిర్మించనున్నామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇళ్ల నిర్మాణానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని, ప్రభుత్వ పరంగా ఏవిధమైన సహకారం కావాలన్నా, అందించేందుకు వారు సంసిద్దంగా ఉన్నారని స్వామి తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, కార్పొరేటర్లు కోలగట్ల శ్రావణి, ఎస్‌వివి రాజేష్, హౌసింగ్ పిడి ఎస్‌వి రమణమూర్తి, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, తాశీల్దార్ ఎం.ప్రభాకరరావు, హౌసింగ్ డిఇ సిహెచ్ శ్రీనివాసరావు, ఏఈలు కె.శ్రీనివాసరావు, రామ్‌ప్రసాద్, గోపాలకృష్ణ, ఇతర అధికారులు, ఆశపు వేణు, మధు తదితర నాయకులు పాల్గొన్నారు.