ప్రభుత్వ భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఆయన గజపతినగరం మండలంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించి, పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలను తనిఖీ చేశారు. ముచ్చెర్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని, డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లీనిక్ భవనాన్ని తనిఖీ చేశారు. నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావడంతో, ప్రస్తుతం జరుగుతున్నపెయింటింగ్ పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తిచేసి, ప్రారంభానికి సిద్దం చేయాలని ఆదేశించారు. కెంగువ గ్రామంలో నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని, హెల్త్ క్లీనిక్‌ను పరిశీలించారు. ఈ రెండు భవనాలు శ్లాబులు పూర్తి చేసి, ప్రస్తుతం ప్లాస్టరింగ్ పనులు జరుగుతుండటంతో, మిగిలిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. తుమ్మికాపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలను తనిఖీ చేశారు. విలేజ్ క్లీనిక్ నిర్మాణం జరుగుతుండటంతో, దానిని కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎంపిడిఓ కిశోర్ కుమార్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.