కొత్త ప్రెస్ అక్రిడిటేషన్ల ప్రక్రియ షురూ..
Ens Balu
2
Tadepalle
2021-06-28 14:17:11
రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడానికి, పాత్రికేయుల సౌలభ్యం కోసం ఆన్ లైన్ వెబ్ సైట్ www.ipr.ap.gov.in ను మరొక మారు అందుబాటులో ఉంచినట్టు ష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నాటికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు అదే లాగిన్ ఐడీ ఉపయోగించి, తమ దరఖాస్తులకు అవసరమైన సవరణలు చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. గతంలో తమ దరఖాస్తుతో పాటు సమర్పించని డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు ప్రస్తుతం అప్ లోడ్ చేసుకునే సౌలభ్యం కల్పించడమైనదని వెల్లడించారు. గత దరఖాస్తులలో అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయనందున, వారు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లు పూర్తి స్థాయిలో లాగిన్ లో కనపడటం లేదని, కావున అభ్యర్థులు విధిగా వారు సమర్పించాల్సిన అన్ని పత్రాలను పీడీఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా ప్రస్తుతం మీడియా సంస్థ మారి ఉంటే, అటువంటి వారు కొత్తగా, మరల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సంబంధిత యాజమాన్యాలు వారి వారి సంస్థలలో పనిచేస్తున్న పాత్రికేయులకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డులు జారీచేయడానికి సిఫార్సు లేఖలను మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసి, సవరించిన లేఖలను తిరిగి అప్ లోడ్ చేయాలన్నారు. అలాగే తాజాగా సిఫార్సు లేఖలను రాష్ట్రస్థాయిలో కమిషనర్ సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో మరియు జిల్లాస్థాయిలో సంబంధిత జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయాలలో సమర్పించాలని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇదివరకు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న పాత్రికేయులు, యాజమాన్యాలు వారికి సంబంధించిన డేటాను మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకొనేందుకు వీలుగా వైబ్ సైట్ ను తేదీ.04.07.2021 వరకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పాత్రికేయులు, మీడియా సంస్థలు సద్వినియోగం చేసుకోవాలని, పూర్తిస్థాయిలో ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేయనివారు నిర్ణీత గడువులోగా తమ దరఖాస్తులను అప్ లోడ్ చేసి వాటి కాపీలను సంబంధిత శాఖ కార్యాలయములలో అందజేయాల్సిందిగా కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి సూచించారు.