మహిళలంతా దిశ యాప్ తమ ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా ఆపద సమయంలో స్వీయ రక్షణ పొందవచ్చునని శంకవరం వీఆర్వో సీతారామ్, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, జెఏ రమణమూర్తిలు పేర్కొన్నారు. మంగళవారం శంఖవరం మండల కేంద్రంలోని సచివాలయంలో గ్రామ వాలంటీర్లతో కలిసి స్థానిక మహిళల ఫోన్లలో దిశ యాప్ ఇనిస్టాల్ చేయించారు. ఈ సందర్భంగా మహిళాపోలీస్ జిఎన్ఎస్ శిరీష మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దిశయాప్ ను ప్రత్యేకంగా రూపొందించిందన్నారు. దీనిని అత్యవసర సమయంలో వినియోగించడం ద్వారా పోలీసుల నుంచి సహాయ సహకారాలు అందుతాయన్నారు. ప్రతీ ఒక్క మహిళ సెల్ ఫోనులో దిశ యాప్ పెట్టుకోవడం ద్వారా దుండగల నుంచి రక్షించుకోవడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఈ యాప్ మహిళల ఫోన్లలో ఉంటే ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లేంత దైర్యం కూడా వస్తుందన్నారు. అనంతరం దిశ యాప్ యొక్క ప్రాముఖ్యత, దీనిని ఏ విధంగా వినియోగించాలో కూడా మహిళలకు అవగాహన కల్పించారు. కాలేజీ వెళ్లే యువతులే కాకుండా ఇంట్లో ఉండే మహిళలు కూడా అత్యవసర సమయంలో దీనిని ఉపయోగించవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యర్తలతోపాటు, ఆశ వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.