నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమం రాగోలు లే ఔట్ కాలనీ వద్ద మునిసిపల్ కమీషనర్ ఓబులేసు ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ముఖ్యఅతిథిగా పాల్గొని గృహ స్థల లబ్ధిదారులతో భూమి పూజ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవి జగనన్న కాలనీలు కావని, ఈ కాలనీల్లో నిర్మిస్తున్న గృహాల వలన గ్రామాలే ఆవిర్బవించనున్నట్లు చెప్పారు. కాలనీల్లో నిరంతర విద్యుత్, తాగునీరు, సిమెంటు రహదారులు, కళ్యాణ మండపం, పార్కు, విద్యుత్ వెలుగులు, మురుగునీటి కాలువలు ఇలా సకల సౌకర్యాలు ఇందులో రానున్నట్లు చెప్పారు. ఇపుడు నిర్మిస్తున్న కాలనీలు మొత్తం పూర్తయితే కాలనీలుగా ఉండవని, సౌకర్య వంతమైన, విలాసవంతమైన గృహాలుగా జగనన్న కాలనీలు ఉండబోతున్నాయని, అందరికీ శాశ్వత చిరునామాగా ఈ కాలనీలు మారబోతున్నాయని అని అన్నారు. ముఖ్యంగా మహిళల వారి పేరునే ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని అన్నారు. రాగోలు జగనన్న కాలనీలో 362 మందికి ఇంటి స్థలాలు మంజూరుచేయడం జరిగిందని, లబ్ధిదారులతో పునాది రాయి వేసి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం లబ్ధిదారుల మనోగతాన్ని శాసనసభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపథమంగా శంకుస్థాపన చేసిన 43వ డివిజన్ నివాసి లబ్ధిదారు దుక్క అపర్ణతో శాసనసభ్యులు మాట్లాడుతూ తమ జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గత 20 ఏళ్లుగా స్వంత ఇళ్లు లేని తమకు జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరుకావడం, అందులో తాను శంకుస్థాపన చేసుకోవడం ఆనందంగా ఉందని శాసనసభ్యులకు వివరించారు. ఇంతవరకు చిరునామా అన్నది లేని తనకు జగనన్న దయవలన తన శాశ్వత చిరునామా రాగోలు కాలనీగా మారుతున్నoదుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.జె.కిషోర్, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, కమీషనర్ ఓబులేసు, తహశీల్ధార్ ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రకాశరావు, శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ అధికారి రాంప్రసాద్, కార్యనిర్వాహక ఇంజినీర్ సుగుణాకర్, ఏ.పి.కార్పొరేషన్ కార్యనిర్వాహక ఇంజినీర్ నాగేశ్వరరావు, మాజీ మునిసిపల్ ఛైర్ పర్సన్ మెంటాడ వెంకట పద్మావతీ, మెంటాడ స్వరూప్ , పొన్నాడా ఋషి, అందవరపు సంతోష్ ,చిట్టి జనార్దన్,చల్లా శ్రీనివాస్ రావు,సాధువైకుంటారావు, లంకం, రాగోలు సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు