పేద కుటుంబాల భద్రతకు భరోసా కల్పించే వైఎస్సార్ బీమా పథకం పరిధిలోకి వచ్చే విధంగా జిల్లాలో అర్హుల నమోదు ప్రక్రియ గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో అత్యంత కచ్చితత్వంతో జరుగుతున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కొత్త మార్గదర్శకాలతో రూపొందిన వైఎస్సార్ బీమా పథకాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 2021-22లో రాష్ట్రంలో 1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో ఉచిత బీమా రక్షణ కల్పించే ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జి.రాజకుమారి తదితరులు హాజరయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అర్హులైన వారికి బీమా కార్డులను కార్యక్రమం సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ఈ-కేవైసీ ద్వారా అర్హులను పథకంతో అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా జిల్లాలో చేపట్టిన 16,53,364 రైస్‌కార్డుల సర్వే పూర్తికావస్తోందని, దాదాపు మూడు లక్షల కార్డులను మాత్రమే ఇంకా సర్వే చేయాల్సి ఉందని వెల్లడించారు. దురదృష్టవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం ఆసరా కానుందని వివరించారు. 18-50 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం, అదే విధంగా 18-70 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వత అంగ వైకల్యం పొందినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుందని వివరించారు. బీమా నమోదు, క్లెయిమ్‌ల చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదుల నమోదుకు 155214 టోల్‌ఫ్రీ నెంబరు కూడా అందుబాటులో ఉందని కలెక్టర్ వెల్లడించారు.
రూపాయి భారం లేకుండా: మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ*
పేద కుటుంబాలపై రూపాయి కూడా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బీమా అందిస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. దురదృష్టకర సంఘటన జరిగిన పరిస్థితిలో పథకం కింద ఎలాంటి జాప్యం లేకుండా సత్వరం క్లెయిమ్‌ల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కోవిడ్ కష్టకాలంలో సైతం ప్రజల సంక్షేమానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి తు.చ.తప్పకుండా అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి లబ్ధిదారునికీ పథకాల ఫలాలు అందుతున్నాయని, సంక్షేమం విషయంలో రాష్ట్రం దేశానికే ఆదర్శవంతంగా ఉందని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి, కార్మిక శాఖ ఉపకమిషనర్ ఎన్.బుల్లిరాణి తదితరులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన, పథకం పరిధిలోకి వచ్చిన వారు హాజరయ్యారు.