గిరి మహిళలు ఆర్దిక సాధికారిత సాధించాలి..
Ens Balu
4
Pedabayalu
2021-07-03 11:13:02
ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకుని గిరిజన మహిళలు ఆర్దిక సాధికారిత సాధించాలని సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి గోపాల క్రిష్ణ రోణంకి అన్నారు . శనివారం పెదబయలు మండలం పెదకోడాపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడుతూ ఏజెన్సీలో 46 హట్ బజారులను నిర్మిస్తున్నామని చెప్పారు. వనధన్ వికాస కేంద్రం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులకు అదనపు విలువలను జోడించి విక్రయించాలని సూచించారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములను అభివృధ్ది చేసుకోవాలని అన్నారు. ఈ నెల 8 వతేదీ నుంచి మొబైల్ ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని, ఆధార్ నమోదు చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు ఉండి వాటిలో తప్పులుంటే సవరించు కోవాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ భవనాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లీనిక్‌ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసే విధంగా పంచాయతీ సర్పంచులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. పెదకోడాపల్లి సర్పంచ్ సెగ్గె వెంకట రమణ గ్రామంలోని తాగునీటి సదుపాయాలు, పెద్దగొంది గ్రామంలో 35 మంది విద్యార్దులు ఉన్నారని పాఠశాల భవనం, గ్రామానికి వీధిదీపాలు వేయించాలని కోరగా ప్రాజెక్టు అధికారి సానుకూలంగా స్పందించారు. వీధిదీపాలను రేపటిలోగా ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో మినీ అంగన్వాడీ మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఋఅనంతరం హట్ బజారు నిర్మాణానికి కేటాయించిన స్దలాన్ని పరిశీలించారు. నిర్మాణాలకు అవసరమైన అనుమతులు జారీ చేస్తామన్నారు. పెదకోడాపల్లి గ్రామంలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం భవనం రైతు భరోసా కేంద్రం నిర్మాణాలను తనిఖీ చేసారు. ఈనెల 8 వ తేదీ నాటికి రైతు భరోసా కేంద్రం నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఎపిడి మురళి, ఏరియా కో ఆర్డినేటర్ నీలా చలం తదితరులు పాల్గొన్నారు.