విప్లవజ్యోతి అల్లూరి యువతకు స్పూర్తి..


Ens Balu
2
Pandrangi
2021-07-04 11:45:41

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పిలుపునిచ్చారు. ఆదివారం అల్లూరి జన్మించిన పాండ్రంగి గ్రామంలో ప్రభుత్వం నిర్వహించిన జన్మదినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.  సీతారామరాజులో ఉన్న నాయకత్వ లక్షణాలు పట్టుదల అమాయక గిరిజనులను బాధల నుండి విముక్తి చేసేందుకు చైతన్య పరచడం మొదలైనవన్నీ యువత నేర్చుకోవాలన్నారు. పేదరికంలో జీవించినప్పటికీ దీక్షతో విద్యాభ్యాసమే కాకుండా జ్యోతిష్యం, ఆరోగ్య శాస్త్రాలలో పట్టు  సాధించారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో అమాయక గిరిజనుల కష్టాలను తెలుసుకుని వారిలో స్ఫూర్తిని నింపి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారి హక్కుల కోసం పోరాటం జరిపినట్లు తీర్చిదిద్దారన్నారు.  గిరిజన ప్రాంతంలో అనేకమంది ఇంకా పలు రంగాల్లో వారు వెనుకబడి ఉన్నారని, అల్లూరి ఆశయాలు సాకారం కావాలంటే  యువత గిరిజనుల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలన్నారు.  27 సంవత్సరాలు జీవించి నప్పటికీ గిరిజనులను విప్లవం వైపు నడిపించి గిరిజన హక్కుల కోసం పోరాడిన యోధుడిగా రాష్ట్రంలోనే కాక దేశంలోనే గుర్తింపు పొందారన్నారు. మాజీ మంత్రి ఎస్.ఆర్.డి.పి.అప్పల నరసింహరాజు మాట్లాడుతూ అల్లూరి తల్లిదండ్రులు గురించి, అల్లూరి సీతారామారాజు గురించి వివరించారు. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త ముత్తంశెట్టి మహేష్ మాట్లాడుతూ పాండ్రంగి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆశయమని పేర్కొన్నారు.  ప్రభుత్వపరంగా ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ గ్రామస్తులు దానికి అనుగుణంగా స్పందించి గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచాలని పచ్చదనాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు ఎం.వేణుగోపాలరెడ్డి, కల్పనా కుమారి, ఆర్.గోవిందరావు, ఆర్.డి.ఒ.పెంచల కిషోర్, టూరిజం శాఖా ప్రాంతీయ సంచాలకులు,  స్థానిక నాయకులు , అధికారులు  పాల్గొన్నారు.

సిఫార్సు