కరోనా సమయంలో రక్తాన్ని దానం చేసిన వారే నిజమైన దేవుళ్లని చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు అన్నారు. మంగళవారం కామవరపుకోట మండల విద్యా వనరుల కేంద్రం లో మానవతా, రెడ్ క్రాస్ సొసైటీ, యాంటీ కరొనా హెల్పింగ్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, ఒకరు రక్తం దానం చేయడం వలన 8 మంది ప్రాణాలు నిలబెట్టడానికి ఆస్కారం వుంటుందన్నారు. అంతేకాకుండా రక్తం దానం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని సైతం పెంపొందించుకోవచ్చునని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. వాటి ద్వారా అత్యవసర సమయానికి రక్తం అందించాలంటే మరింత మంది రక్తం దానం చేయడానికి ముందడుగు వేయాలన్నారు. ఈ రక్తదాన శిబిరంలో 25 మంది దాతలు రక్తం అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకురాలు రాఘవ రాజు భవాని, మానవతా అధ్యక్షులు షేక్ ఇబ్రహీం వీరమల్ల మధు మున్నంగి శ్రీనివాస్ నిజాపరపు దుర్గాప్రసాద్ సౌజన్ సాయి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.