వీబీఆర్ఐ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు..
Ens Balu
1
Samarlakota
2021-07-08 13:02:26
సామర్లకోటలోని పశువైద్య జీవశాస్త్ర పరిశోధన సంస్థ (వీబీఆర్ఐ)ను దశల వారీగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, రూ.20 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. రూ.2.24 కోట్ల ఖర్చుతో వీబీఆర్ఐ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కోళ్ల వ్యాధి నిరోధక టీకా మందుల నాణ్యతా పరీక్షల లేబొరేటరీ (క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్)ను కలెక్టర్ మురళీధర్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1978-79లోనే సామర్లకోటలో ఏర్పాటు చేసిన కోళ్ల వ్యాధినిరోధక టీకా మందుల ఉత్పత్తి కేంద్రం రాష్ట్రంలోని 13 జిల్లాల అవసరాలను తీర్చుతోందని, నాణ్యమైన టీకాలు అందిస్తూ కోళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ సన్న, చిన్నకారు రైతుల ఆర్థిక స్వయంసమృద్ధికి ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఉన్నత ప్రమాణాలతో ఈ కేంద్రంలో చేపట్టిన ఆధునికీకరణ చర్యల వల్ల ఏడాదికి 280 లక్షల మోతాదుల టీకా మందులను ఉత్పత్తి చేసే స్థాయికి చేరిందన్నారు. గతంలో ఇక్కడ ఉత్పత్తి చేసిన టీకాలకు నాణ్యతా పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌కు పంపాల్సి వచ్చేదని, అయితే డ్రగ్ కంట్రోల్ ప్రాధికార సంస్థ మార్గదర్శకాల మేరకు ఎక్కడ ఉత్పత్తి చేసిన టీకాలను అక్కడే నాణ్యతా పరీక్షలు చేసేందుకు వీలుగా ఇప్పుడు కొత్తగా రూ.2.24 కోట్లతో ల్యాబ్‌ను ఏర్పాటు చేసి, ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని పెరటి కోళ్లకు ఉచితంగా టీకా అందించి వాటి ఆరోగ్య పరిరక్షణకు, అధిక ఉత్పత్తులు సాధించేలా చేయడంలో ఈ టీకా ఉత్పత్తి కేంద్రం కీలకపాత్ర పోషిస్తున్నట్లు పశుసంవర్థక శాఖ జేడీ సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. కోళ్లలో వచ్చే తీవ్ర ప్రమాదకర వ్యాధులకు సంబంధించి టీకాలను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సామర్లకోట మునిసిపల్ ఛైర్పర్సన్ గంగిరెడ్డి అరుణాకృష్ణమూర్తి, దవులూరి సుబ్బారావు, దవులూరి దొరబాబు, తహసీల్దార్ జితేంద్ర, మున్సిపల్ కౌన్సిలర్లు, రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు, సిబ్బంది పాల్గొన్నారు.