ప్రజలకు సత్వరమే సేవలందాలి..
Ens Balu
5
Nellimarla
2021-07-12 16:45:57
గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వరమే సేవలు అందాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు సిబ్బందిని ఆదేశించారు. సోమవారం విజయనగరం జిల్లా గుర్ల, నెల్లిమర్ల మండలాల్లో జెసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిబ్బంది సమయపాలన పాటించడంతో సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్య ఇవ్వాలన్నారు. సచివాలయాల ద్వారా అందేసేవలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అనంతరం సచివాలయాల్లో సిబ్బంది హాజరును పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఆన్‌లైన్ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరై, ప్రజలకు అందుబాటులో ఉండాలని, మెరుగైన సేవలను అందించాలని కోరారు. కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలను నాటాలని సూచించారు. ఇఓపిఆర్‌డి కూడా జెసి వెంట ఉన్నారు. నెల్లిమర్ల నగరపంచాయితీ పరిధిలో నిర్మాణానికి ప్రతిపాదించిన పట్టణ ఆరోగ్య కేంద్రం స్థలాన్ని, మార్కింగులను జెసి వెంకటరావు పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యత ఎక్కడా తగ్గకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల మున్సిపల్ అధికారులు, ఏఇలు పాల్గొన్నారు.