సచివాలయ స్పందనకు కరోనా మోకాలడ్డు..
Ens Balu
5
తాడేపల్లి
2021-07-14 10:43:50
గ్రామస్థాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి.. సచివాలయాలు దాటి గ్రామస మస్యలు జిల్లా కార్యాలయాలకు రాకూడదు.. ప్రతీరోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 వరకూ సచివాలయాల్లో స్పందన కార్యక్రమం తప్పక జరగాలి.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలి.. స్పందన కార్యక్రమం పై వాలంటీర్లతో ప్రజలకు అవగాహనక కల్పించాలి.. ఇవీ రాష్ట్రప్రభుత్వ ఆదేశాలు నాణేనికి ఒక వైపు.. ఈరోజు మీ మండలానికి 1000 కరోనా టీకాలు కేటాయించాం.. సచివాలయ సిబ్బంది ఉదయం 8గంటలకు కేంద్రానికి వచ్చేసి సాయంత్రం ఆరుగంటల వరకూ ఉండైనా వాక్సిన్లు మొత్తం ప్రజలకు చేరేలా చేయాలి.. 2వ శనివారం, ఆదివారం తేడాలేకుండా కరోనా వేక్సినేషన్ డ్యూటీలు సచివాలయ సిబ్బంది బుజాన వేసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలి.. మానవతా ద్రుక్పదంతో పనిచేయాలి.. లక్ష్యాలకు మించి కరోనా వేక్సినేషన్ జరిగిపోవాలి.. వేక్సినేషన్ డిజిటలైజేషన్ చేయడానికి డిజల్ అసిస్టెంట్లు పనిచేయాలి(వీరిని కరోనా వేక్సినేషన్ విధులకు వనియోగించకూడాని ప్రత్యేక జీఓ ఉన్నా) ఇవినాణేనికి రెండో వైపు. ఉదయం 9.30 సచివాలయానికి వచ్చే సిబ్బంది మధ్యాహ్నం రెండు గంటల వరకూ సిబ్బంది విధులు చూసుకుంటూ, మధ్యాహ్నం నుంచి స్పందన కార్యక్రమం నిర్వహించాలనేది ప్రభుత్వ ఉత్తర్వులు. కానీ ఉదయం 8గంటల నుంచి సాంత్రం ఆరు గంటల వరకూ కరోనా వేక్సినేషన్ దగ్గరే సచివాలయ సిబ్బంది ఉండిపోతే ఇక స్పందన కార్యక్రమం ఎలా నిర్వహిస్తారో ప్రభుత్వ ఉన్నతాధికారులే చెప్పాలి. గ్రామసచివాలయ ఉద్యోగులకు 2వ శనివారం, ఆదివారం రోజులు కూడా సెలవు లేకుండా ఆరోజుల్లోనే కరోనా వేక్సినేషన్ డ్యూటీలు వేస్తూ ప్రజలకు వీరితో సేవలందిస్తున్నారు. అలాంటి సమయంలో ఇక స్పందన కార్యక్రమం సచివాలయాల్లో ఏం జరుగుతుందో..ఎలా జరుగుతుందనేది అధికారులు గుర్తించాల్సివుంది. అయితే ఇదెందుకు గుర్తొచ్చిందనే అనుమానం కలవచ్చు ఈ న్యూస్ కార్డ్ చదివే పాఠకులకు.. ఇటీవలే రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి నేరుగా తాను కూడా వారానికి రెండు రోజులు గ్రామ సచివాలయాలను తనిఖీ చేయడానికి వస్తానని ప్రకటించడంతో అధికారులు ఆఘమేఘాలపై స్పందన ద్రుష్టిపెట్టేశారు. దీనితో మరోసారి సచివాలయాల్లో స్పందన కార్యక్రమం తెరపైకి వచ్చింది. కరోనావేక్సినేషన్ కార్యక్రమానికి ఉదయం 8 గంటలకొచ్చి సాయంత్రం 6 గంటలవరకూ ఉన్నా ఒక్కోసారి వేక్సిన్లు అందించలేకపోతున్నామని.. చాలా మంది ప్రజలు వేక్సిన్ వేసుకోవడానికి ముందుకి రావడం లేదని సచివాలయ ఉద్యోగులు తలలు పీక్కుంటున్నారు. ఈ క్రమంలోనే టార్గెట్లు పూర్తవక్కపోతే మండల అధికారుల ఒత్తిడి, వార్నింగ్ లు మరింత ఇబ్బంది కరంగా మారాయని చెబుతున్నారు. తమకు వారానికి ఒక్కరోజు వచ్చే ఆదివారం సెలవులు కూడా వినియోగించుకోవడానికి వీలులేకుండా విధులు నిర్వహిస్తున్నా గుర్తింపు రావడం లేదని చెబుతున్నారు. వారంలో రెండు రోజులు కరోనా వేక్సినేషన్ కే సమయం మొత్తం వెచ్చిస్తే.. స్పందన కార్యక్రమం ఎలా నిర్వహిస్తామని చెబుతున్నారు. అందులోనూ కార్యాలయానికి వచ్చే వారికి ఎవరి కరోనా ఉందో.. ఎవరికి లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. కోవిడ్ వేక్సినేషన్ తోపాటు, సచివాలయంలో కూడా కనీసం హేండ్ శానిటైజర్ గానీ, గ్లౌజులు గానీ, ఫేస్ మాస్కులు గానీ ఏర్పాటు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జనావాసాల్లో విధులు నిర్వహిస్తూ చాలా మంది సచివాలయ సిబ్బంది కరోనా వైరస్ భారిన పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ విధుల ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటలోపు ముగించేసుకోడానికి పూర్తిస్థాయిలో ఆస్కారం వుంటుందని సచివాలయ ఉద్యోగులే చెబుతున్నారు. మిగిలిన సమయం మొత్తం ఫీవర్ సర్వే, కరోనా డ్యూటీలకే సరిపోతుందని చెబుతున్నారు. దానికితోడు చాలా సచివాలయాల్లో ఉన్న సిబ్బంది ఖాళీల ద్రుష్ట్యా మిగిలిన వారి విధులు కూడా ఉన్న సిబ్బందే పంచుకొని చేయాల్సి వస్తుందంటున్నారు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన నిర్వహించే విషయంలో జిల్లా అధికారులకు ఏస్థాయిలో క్లారిటీ ఉందో సిబ్బందికి కరోనా వేక్సినేషన్ డ్యూటీలు వేయడాన్ని బట్టి అర్ధమవ్వాలి. ఈ తరుణంలో జిల్లా కలెక్టర్లు వారానికి రెండురోజులు, సచివాలయ జాయింట్ కలెక్టర్లు వారానికి 4 రోజులు సచివాలయ సందర్శన చేయాలనే సీఎం ఆదేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈ విషయంలో జిల్లా అధికారులు కూడా సచివాలయ సిబ్బందికే ఈ కరోనా వేక్సినేషన్ విధులు అప్పగించడంతో రాష్ట్రంలో చాలా మంది జిల్లా కలెక్టర్లుగానీ, గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు సచివాలయాల్లోని స్పందన కోసం పట్టించుకోకపోవడం కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. విశేషం ఏంటంటే కరోనా సెకెండ్ వేవ్ లో అన్ని ప్రభుత్వశాఖల అధికారులకూ, సిబ్బందికి విధి నిర్వహణ సమయంలో కొంత వెసులుబాటు(ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12) ఇచ్చినా సచివాలయ సిబ్బందికి ఇవ్వలేదు. అలాగే నేటికీ సెలవుల సమయం అంటే 2వ శనివారాలు, ఆదివారాల్లోనూ నేడు గ్రామసచివాలయ సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇన్ని జరిగినా నేటికీ సచివాలయ ఉద్యోగుల కోసంగానీ, విధులు, సమయం కోసం గానీ ఆలోచించిన దాఖలాలు కూడా ఎక్కడా కనిపించలేదని చెబుతున్నారు. ఇలాంటి కారణాలే గ్రామసచివాలయాల్లో స్పందన సక్రమంగా జరగకపోవడానికి కరోనా రూపంలో మోకాళ్లు అడ్డుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, జిల్లా స్థాయిల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఆలోచిస్తే తప్పా గ్రామ సచివాలయాల్లో స్పందన కార్యక్రమం ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించదనే బలమైన కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి కరోనా వేక్సినేషన్ విధులకు సచివాలయ సిబ్బందిని దూరంచేసి.. దానిని వైద్యఆరోగ్య సిబ్బందికే అప్పగించి.. ప్రభుత్వం ఏ నిర్ణయం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు ఏ స్థాయిలో పరిష్కరిస్తుందో..!