విశాఖ మన్యంలో రూ.188.50 కోట్లతో ఉపాది పనులు..


Ens Balu
1
పాడేరు
2020-09-03 16:05:13

విశాఖ మన్యంలో రూ.188 కోట్ల 50 లక్షలతో జరుగుతున్న నిర్మాణపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పాడేరు ఐటిడిఏ పీఓ డాక్టర్ వేంకటేశ్వర్ సలిజామల అధికారులను ఆదేశించారు. గురువారం ఐటిడి ఏ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమశాఖ, ప్రత్యేక నీటి పారుదల, రహదారులు భవనా లు,గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఉపాధిహామీ కన్వర్జన్స్ పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధిహామీ పనులు పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం నేతృత్వంలో జరుగున్నాయని, పనిభారం పెరిగి నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారని, జిల్లా కలెక్టర్ అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులను బాధ్యులను చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారన్నారు. ప్రతీ మండలానికి ఒక ఉపకార్య నిర్వహక ఇంజనీరు,4 సహాయక ఇంజనీర్లు విధులు నిర్వహిస్తారని చెప్పారు. అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులు ఈపనులు మావికావు అనే భావన విడనాడి సమన్వంతో మార్చి నెలాఖరునాటికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన్యంలో పెద్ద ఎత్తున ఉపాధి నిధులు ఖర్చు చేయాలన్నారు. 11 మండలాలలో 1629 పనులు జరుగుతున్నాయన్నారు. వీటిలో 1600 ల భవన నిర్మాణాలు ఉన్నాయన్నారు. ఇంజనీర్లకు అప్పగించిన పనిని నిర్దష్టమైన గడువులోగా పూర్తి చేయాలన్నారు. వారానికి రూ.9.61 కోట్ల ఖర్చు చేయాలన్నారు. ప్రతీ వారం పనుల పురోగతిపై సమీక్షిస్తామన్నారు. ప్రహారీ గోడల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నిర్మాణానికి పటిష్టమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.  పంచాయతీ రాజ్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ జి. సుధాకర రెడ్డి మాట్లాడుతూ, రూ.84.56 కోట్ల తో 212 గ్రామ సచివాలయ భవనాలు, రూ.45.56 కోట్లతో 209 రైతు భరోసా కేంద్రాలు, రూ.20.18 కోట్ల తో 135 వై ఎస్ ఆర్ హెల్త్ క్లీనిక్‌లు, రూ.38.28 కోట్లతో 382 అంగన్వాడీ భవన నిర్మాణాలు జరుగు తున్నాయన్నారు. భవన నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకుని రావాలన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇలు కెవి ఎస్ ఎన్ కుమార్, జి.మురళి, పంచాయతీ రాజ్ ఇ ఇ. ఆర్ కె భాస్కర్, పి ఐ యు ఇ ఇ శ్రీనివాస్, అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.