కలెక్టర్ హరిజవహర్ లాల్ కి ఘన వీడ్కోలు..


Ens Balu
3
Vizianagaram
2021-07-28 14:04:47

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  మూడేళ్ల రెండు నెల‌ల‌పాటు జిల్లా క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హించి, ప‌దోన్న‌తిపై ఆర్ అండ్ ఆర్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీపై వెళ్తున్న డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ కు, అపూర్వ వీడ్కోలు ల‌భించింది. వివిధ శాఖ‌ల‌ అధికారులు, పుర ప్ర‌జ‌లు బుధ‌వారం జిల్లా స‌రిహ‌ద్దుల వ‌ర‌కూ వెళ్లి క‌లెక్ట‌ర్ కుటుంబాన్ని ఘ‌నంగా సాగ‌నంపారు. జిల్లా ప్ర‌జ‌లు చూపిన‌ ఆత్మీయ ఆద‌ర‌ణ ప‌ట్ల క‌లెక్ట‌ర్ దంప‌తులు సైతం క‌న్నీళ్ల‌ప‌ర్యంత‌మ‌య్యారు.

              జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ కుటుంబం ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో బంగ్లా నుంచి బ‌య‌లుదేరింది. ముందుగా బంగ్లాలో ప‌నిచేసే ప్ర‌తీఒక్క‌రినీ క‌లెక్ట‌ర్ దంప‌తులు శాలువ‌ల‌తో స‌త్క‌రించి, జ్ఞాపిక‌లు బ‌హూక‌రించి, కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్ స‌తీస‌మేతంగా హాజ‌రై క‌లెక్ట‌ర్ కుటుంబానికి వీడ్కోలు ప‌లికారు. జాయింట్ క‌లెక్ట‌ర్ (సంక్షేమం) జె.వెంక‌ట‌రావు, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు కూడా క‌లెక్ట‌ర్ దంప‌తుల‌ను స‌న్మానించి, వీడ్కోలు ప‌లికారు. అనంత‌రం డిఎఫ్ఓ ఎస్‌.జాన‌కిరావు, హ‌రిత విజ‌య‌న‌గ‌రం బృందం ఎం.రామ్మోహ‌న‌రావు, కేస‌లి అప్పారావు, ఈశ్వ‌ర్రావు, ర‌మేష్‌, గోపి త‌దిత‌రుల ఆధ్వ‌ర్యంలో, బంగ్లా నుంచి క‌లెక్ట‌ర్ ఆఫీసు వ‌ర‌కూ, క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌ను ఊరేగింపుగా తీసుకు వ‌చ్చారు. అక్క‌డి గాంధీ విగ్రహానికి క‌లెక్ట‌ర్‌, జెసిలు, పూల‌మాలలు వేసి నివాళుల‌ర్పించారు.

జిల్లా ప్ర‌జ‌ల స‌హ‌కారం మ‌రువ‌లేనిది
డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌
              త‌న మూడేళ్ల ప‌ద‌వీకాలంలో జిల్లా ప్ర‌జ‌లు అందించిన స‌హ‌కారం మ‌రువ‌లేనిద‌ని, క‌మిష‌న‌ర్‌గా ప‌దోన్న‌తి పొంది జిల్లానుంచి బ‌దిలీపై వెళ్తున్న క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ అన్నారు. ఆయ‌న్ను స్థానిక పోలీసు శిక్ష‌ణా కేంద్రంలో ఘ‌నంగా స‌న్మానించారు. ముందుగా అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి, నివాళుల‌ర్పించిన అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, జిల్లాతో త‌న అనుబంధాన్ని వివ‌రించారు. జిల్లా ను హ‌రిత విజ‌య‌న‌గ‌రంగా మార్చ‌డంలో జిల్లా ప్ర‌జ‌లిచ్చిన స‌హ‌కారం మ‌రువ‌లేనిద‌ని అన్నారు. జిల్లాలో ప‌చ్చ‌ద‌నాన్ని పెంచాల‌న్న ఆలోచ‌న‌, తొలుత పిటిసిని సంద‌ర్శించిన త‌రువాతే త‌న‌లో మొద‌ల‌య్యింద‌ని చెప్పారు. జిల్లా ప్ర‌జ‌ల‌కు స్వ‌చ్ఛ‌మైన గాలి, నీటిని అందించాల‌న్న‌దే త‌న కార్య‌క్ర‌మాల వెనుక‌నున్న ఉద్దేశ్య‌మ‌ని తెలిపారు. తాను మొద‌లు పెట్టిన ప్లాంటేష‌న్‌, శానిటేష‌న్‌, చెరువుల శుద్ది కార్య‌క్ర‌మాల‌ను భ‌విష్య‌త్తులో కూడా కొన‌సాగించాల‌ని కోరారు.

              పిటిసి ప్రిన్సిపాల్ డి.రామ‌చంద్ర‌రాజు మాట్లాడుతూ, జిల్లాను అభివృద్ది ప‌థాన న‌డిపి, సుమారు 20 జాతీయ అవార్డుల‌ను సాధించిన ఘ‌న‌త క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌కే ద‌క్కింద‌న్నారు. ఆయ‌న ఈ మూడేళ్ల‌లో జిల్లాను హ‌రిత విజ‌య‌న‌గ‌రంగా మార్చార‌ని కొనియాడారు. జిల్లా ప్ర‌జ‌ల‌కు మంచి ఆక్సీజ‌న్‌ను అందించాల‌న్న త‌ప‌న క‌లెక్ట‌ర్‌లో క‌నిపించింద‌ని చెప్పారు. జిల్లా ప్ర‌జ‌ల మ‌న‌సులో ఆయ‌న చిర‌కాలం గుర్తుండిపోతార‌ని అన్నారు.

             జిల్లా సాంఘిక సంక్షేమ‌శాఖ డిప్యుటీ డైరెక్ట‌ర్ కె.సునీల్ రాజ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో, ద‌ళిత సంఘాలు  క‌లెక్ట‌ర్ దంప‌తుల‌ను గ‌జ‌మాల‌తో స‌త్క‌రించాయి. ద‌ళిత సంఘాల నాయ‌కులు పి.చిట్టిబాబు, బ‌స‌వ సూర్య‌నారాయ‌ణ‌, భానుమూర్తి మాట్లాడుతూ, క‌లెక్ట‌ర్‌కు అభినంద‌న‌లు తెలిపారు. ఓపెన్‌టాప్ వాహ‌నంలో క‌లెక్ట‌ర్‌ను పిటిసిలో ఊరేగించారు. దారిపోడ‌వునా క‌ళాశాల విద్యార్థినులు పూలు జ‌ల్లారు. కార్య‌క్ర‌మంలో డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, జెడిఏ ఎం.ఆశాదేవి, డిపిఆర్ఓ డి.ర‌మేష్‌, పిటిసి వైస్ ప్రిన్సిపాల్ పి.వెంక‌ట‌ప్పారావు, డిఎస్‌పిలు వి.వెంక‌ట‌ప్పారావు, రామారావు, ఆస్మా ఫ‌ర్‌హీనా, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.
సిఫార్సు