ప్రజలకు ఉత్తమ సేవలందించండి..
Ens Balu
3
Bondapalli
2021-07-29 17:06:07
సచివాలయ సిబ్బంది గ్రామాల్లో ప్రజానీకానికి ఉత్తమ సేవలందిస్తూ ఈ వ్యవస్థకు మంచిపేరు తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పాలనను వారి ఇంటి ముంగిటకే తెచ్చేందుకు ఎంతో మంచి ఆశయంతో ముఖ్యమంత్రి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారని, దీనిని విజయవంతం చేసే బాధ్యత సచివాలయ ఉద్యోగులపైనే వుంటుందన్నారు. ప్రజా సమస్యలను సకాలంలో సత్వరం పరిష్కరిస్తూ మంచి సేవలు అందించినపుడు ఆయా గ్రామాల ప్రజలు సచివాలయ వ్యవస్థపై నమ్మకం ఏర్పరచుకుంటారని చెప్పారు. సచివాలయ ఉద్యోగిగా గ్రామీణ ప్రజలకు సేవలందించే అవకాశం కలిగినందుకు గర్వపడాలని పేర్కొన్నారు. బొండపల్లి మండలం అంబటివలసలో గ్రామ సచివాలయాన్ని జె.సి.(ఆసరా) జె.వెంకటరావు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో, వలంటీర్లతో మాట్లాడి సచివాలయం ద్వారా పథకాల అమలు, ప్రజలకు సేవలందించడంపై ఆరా తీశారు. ఉద్యోగుల హాజరుపట్టికను తనిఖీచేశారు.