ఏజెన్సీలోని గిరిజనులు పండించే అటవీ ఉత్పత్తులు దళారులకు అమ్మకుండా అధిక లాభాలకు వారే స్వయంగా అమ్ముకోవాలని పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం మినుములూరు కాఫీ బోర్డు కార్యాలయంలో మిరియాల మొక్కలు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలోని చాల మంది గిరిజన రైతులు పండించే పంటలను సంతలకు తీసుకుని వచ్చి అమ్ముతున్నారని ఈ విధానాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. అరకు కాఫీకి మంచి గుర్తింపు వచ్చిందని ఆమె తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి రైతులకు ఎన్నో సంక్షేమ పధకాలు అందజేసారని అన్నారు. రైతే రాజు అనే నినాదంతో ముఖ్యమంత్రి రైతులకు రైతు భరోసా కింద రూ.13500 అందించారన్నారు. కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ జయంతి ఘోష్ మాట్లాడుతూ కాఫీ పంట ఏజెన్సీలో అధికంగా పండుతున్నాదని దాని వలన గిరిజన రైతులు ఆదాయం పొందుతున్నారన్నారు. స్సైసెస్ బోర్డు , ఐటిడి ఏ సంయుక్తంగా మిరియాల మొక్కలను రైతులకు పంపిణీ చేస్తున్నారన్నారు. జి సిసి డి ఎం కురసా పార్వతమ్మ మాట్లాడుతూ గిరిజనులు పండిస్తున్న పంటలకు జిసిసి నుంచి రుణాలు అందిస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాఫీ పంటలకు రూ.20 వేలు, వ్యవసాయ పంటలకు రూ.10 వేలు రుణాలు అందిస్తామన్నారు. రుణాలు పొందడానికి గిరిజన రైతులు సొసైటీలో సభ్యత్వ ం కలిగి ఉండాలన్నారు. రైతులకు సొసైటీలో సభ్యత్వం లేకపోతే సభ్యులుగా నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం 7500 మిరియాల మొక్కలను 100 మంది గిరిజన రైతులకు ఎం ఎల్ ఎ చేతుల మీదుగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మినుములూరు కాఫీ బోర్డు ఎస్ ఎల్ ఓ పి . విష్ణు, మోదాపల్లి సర్పంచ్ కొర్రా మంగమ్మ ,మోదాపల్లి, గుర్రగరువు గ్రామాలకు చెందిన గిరిజన రైతులు పాల్గొన్నారు.