సంక్షేమ పథకాలన్నీ సచివాలయాల నుంచే..
Ens Balu
2
Karapa
2021-08-04 14:23:37
ప్రభుత్వ ప్రాధాన్య సంక్షేమ పథకాలు అమలులో గ్రామ సచివాలయాల పాత్ర కీలకమని, వీటిద్వారా ప్రజలకు సంతృప్తికరమైన, నాణ్యమైన సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ కరప మండలంలో పర్యటన సందర్భంగా గొర్రిపూడి, పాతర్లగడ్డ గ్రామాల్లోని సచివాలయాలను తనిఖీ చేశారు. బయో మెట్రిక్ అటెండెన్స్, సంక్షేమ పథకాల అర్హతలను తెలియజేసే పోస్టర్ల ప్రదర్శన, లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన తదితర తొమ్మిది అంశాలను నిశితంగా పరిశీలించారు. ప్రధానంగా బియ్యకార్డులు, పెన్షన్‌కార్డులు, ఆరోగ్యశ్రీకార్డులు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన దరఖాస్తులను నిర్ణీత ఎస్ఎల్ఏ గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నారు. అదే విధంగా ఎండీయూ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందిస్తున్న తీరును జేసీ పరిశీలించారు. పాతర్లగడ్డ డ్రెయిన్‌లో గుర్రపుడెక్క తొలగింపు పనులు పూర్తయిన నేపథ్యంలో డ్రెయిన్‌ను జేసీ పరిశీలించి, పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల ద్వారా పూర్తి ఫలాలు అందించేందుకు వీలుకల్పించే ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియ క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరును జేసీ పరిశీలించి, స్వయంగా ఓ రైతుకు చెందిన పంటను ఈ-క్రాప్ బుకింగ్ చేశారు. పర్యటనలో జేసీ వెంట కరప తహసీల్దార్ కేకే విశ్వేశ్వరరావు, మండల వ్యవసాయాధికారి గాయత్రీదేవి, డ్రెయిన్స్ ఏఈ కీర్తి తదితరులు పాల్గొన్నారు.