సిబ్బంది బాధ్యతా యుతంగా వుండాలి..
Ens Balu
3
Denkada
2021-08-04 14:28:08
గ్రామ సచివాలయానికి వివిధ సమస్యలపై వచ్చే ప్రజలతో సిబ్బంది మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించి వారు చెప్పిన సమస్యలను సావధానంగా ఆలకించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు సచివాలయ సిబ్బందికి సూచించారు. వివిధ పథకాలను, ప్రభుత్వ సేవలను ఏవిధంగా పొందాలనే అంశంపై గ్రామీణుల్లో కొందరికి అవగాహన వుండకపోవచ్చని వారు సచివాలయానికి నివేదించడానికి వచ్చినపుడు వారికి ఏవిధంగా సమస్య పరిష్కారం అవుతుందో వివరించి చెప్పాలన్నారు. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కారం అయితే జిల్లా కేంద్రానికి వినతులు అందించే అవసరమే వుండదని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు బుధవారం నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని డెంకాడ, పూసపాటిరేగ మండలాల్లో పర్యటించి పలు గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. ముందుగా పూసపాటిరేగ మండలం లోని కుమిలి-1 గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడి రిజిష్టర్‌లు, రికార్డులు తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది అంతా విధులకు హాజరయ్యిందీ లేనిదీ ఆరా తీశారు. ప్రభుత్వ పథకాల అమలు గురించి తెలుసుకున్నారు. అనంతరం డెంకాడ మండలం గుణుపూరుపేట గ్రామ సచివాలయాన్ని సందర్శించి సచివాలయంలో వివిధ పథకాలపై ప్రదర్శించిన సమాచారాన్ని పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో మాట్లాడి గ్రామస్థులకు ప్రభుత్వ సేవలు ఏవిధంగా అందిస్తున్నదీ తెలుసుకున్నారు. గ్రామ ప్రజలకు అందుబాటులో వుంటూ ఉత్తమ సేవలందించాలని సచివాలయాలను ఆదర్శంగా నిలపాలన్నారు. కోవిడ్ పై అప్రమత్తంగా ఉండాలని జె.సి. సూచించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించెలా వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలని కోరారు.