పచ్చని మొక్కలపైనే మానవ మనుగడ ఆధారపడి ఉందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సలహా కమిటీ సభ్యులు కాండ్రేగుల వెంకటరమణ అన్నారు. జాతీయ భీమా కార్మిక సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శ్రీకనకదుర్గ అమ్మవారి దేవాలయం సత్యనారాయణపురం కళ్యాణగిరిపై బుధవారం ఆయన మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ, మానవ మనుగడలో అత్యంత కీలకమైన పర్యావరణం, మొక్కలు నాటడాన్ని సామాజిక బాధ్యతగా అందరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. శాస్త్ర, సాంకేతిక విప్లవం.. విస్తారమైన వ్యవసాయ క్షేత్రాలు.. సింథటిక్ ఉత్పత్తుల వినియోగం, వాటి ఉత్పత్తి పద్ధతులు ఇవన్నీ ప్రకృతికి విఘాతం కలిగిస్తూ క్రమంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉ ష్ణోగ్రతల్లో మార్పులు, వాయు కాలుష్యం లాంటి వాటి గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. చెట్లు పర్యావరణానికి ఎంతో ముఖ్యమని కాండ్రేగుల వెంకటరమణ అన్నారు. కార్యక్రమంలో దేవాలయం వ్యవస్థక కార్యదర్శి బోయిన నాగేశ్వరరావు, జాతీయ భీమా కార్మిక సంస్థ కేంద్ర కమిటీ సభ్యుడు బొడ్డేడ అప్పలనరసయ్య, సభ్యులు ఎం.జగదీష్, లక్కరాజు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.