ఇంజనీరింగ్ అధికారుల మైండ్ సెట్ మారాలి..కలెక్టర్


Ens Balu
1
Paderu
2020-09-04 18:13:32

ఏజెన్సీలో నిర్మాణాలు యుద్ద ప్రాతిపధికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏజెన్సీ పర్యటనలో భాగంగా పాడేరు ఐటిడి ఏ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనులు సకాలంలో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయడానికి ఇంజనీరింగ్ అధికారుల మైండ్ సెట్ మార్చుకోవాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయ భవనాలు, అంగన్వాడీ భవనాలు, వై ఎస్ ఆర్ హెల్త్ క్లీనిక్‌లు, నాడు నేడులో ప్రహారీ గోడలు పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఐదు పనులపై వారం వారం సమీక్షిస్తున్నారని చెప్పారు. ఐదు పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పనులు పూర్తి చేసే బాధ్యత ఇంజనీరింగ్ అధికారులపైనే ఉందన్నారు. ఇంజనీరింగ్ అధికారులు ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి అనుమతి లేకుండా మైదాన ప్రాంతానికి వస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మన్యంలోనే నివాసం ఉండాలని చెప్పారు. ఏ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా సంబంధిత మండల కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని అన్నారు. రేపు చేయవలసిన పనిని ఈరోజే చెయ్యాలని, ఈ రోజు చేయవలసిన పనిని ఇప్పుడే చేయాలని సూచించారు. ఉపాధిహామీ పధకం లో చేపట్టిన పనులు పర్యవేక్షణకు పాడేరు నియోజక వర్గానికి గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ కుమార్‌ను,పంచాయతీరాజ్ ఈ ఈని కుసుమ భాస్కర్‌ను బాధ్యులుగా నియమించినట్లు చెప్పారు. అరకువేలీ నియోజక వర్గానికి గిరిజన సంక్షేమశాఖ ఈ ఈ జి.మురళి, పంచాయతీరాజ్ (పి ఐ యు) ఈ ఈ శ్రీనివాస్‌రావును బాధ్యులుగా నియమించామన్నారు. పనులను ప్రతీరోజు తనిఖీ చేసి ఇంజనీర్లతో సమీక్షించాలని ఈ ఈలను ఆదేశించారు. పనులను సవాల్‌గా తీసుకుని పూర్తి చేయాలన్నారు. ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల మాట్లాడుతూ ఇంజనీర్లకు లక్ష్యాలను నిర్దేశించామని చెప్పారు. మార్చి 31 వతేదీలో రైతు భరోసా కేంద్రాలు , అంగన్వాడీ భవనాలు పూర్తి చేయాలన్నారు. ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతీ వారం రూ.9.61 కోట్ల పనులు జరగాలని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్. ఇ జి.సుధాకరరెడ్డి, ఎస్ ఎస్ ఎ పి. ఓ మల్లిఖార్జున రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ ఇ ఇ కెవి ఎస్ ఎన్ కుమార్, పంచాయతీ రాజ్ ఇ ఇ కుసుమ భాస్కర్, డ్వమా పి డి సందీప్ 11 మండలాల డి. ఇలు తదితరులు పాల్గొన్నారు.