అర్హులైన వారందరికీ వేక్సిన్ అందాలి..
Ens Balu
2
Gantyada
2021-08-06 13:50:41
గ్రామాల్లో పనిచేసే సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు గంట్యాడ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. జె.సి. శుక్రవారం గంట్యాడ మండలం కొండ తామరాపల్లిలో పర్యటించారు. కోవిడ్ ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా జరుగుతున్న టీకాలు వేసే కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామంలో 45 ఏళ్లకు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులు, ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లు, రేషన్ డీలర్లు, టీచర్లు తదితర వర్గాల్లో వ్యాక్సిన్ వేయించుకోని వారు ఎంతమంది ఉన్నారని ఆరా తీసి వారందరికీ ఈరోజే టీకాలు వేయించాలని మండల తహశీల్దార్, ఎంపిడిఓ, ఎం.ఇ.ఓ., వైద్యాధికారులకు సూచించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి రిజిష్టర్లు, రికార్డులు పరిశీలించారు. సంక్షేమ పథకాల తీరును అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో ప్రజలకు తెలిసేలా సంక్షేమ పథకాల సమాచారం అందుబాటులో వుంచిందీ లేనిదీ పరిశీలించారు. గ్రామాల్లో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని, ఈ దిశగా వలంటీర్ల ద్వారా అవగాహన కలిగించాలన్నారు. సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న విధులపై ఆరా తీశారు. కార్యాలయ పనివేళల్లో సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుండాలని స్పష్టంచేశారు.