క్షేత్రస్థాయిలో పనిచేసే సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి కళ్లూ, చెవులు లాంటివారని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, క్షేత్రస్థాయి సమస్యలు వీరిద్వారానే సరిగ్గా తెలుసుస్తుందని అన్నారు. సచివాలయ సిబ్బంది అంతా ప్రభుత్వ పథకాలను సంపూర్ణంగా అవగాహన చేసుకొని, వాటిపై ప్రజలకు సానుకూలంగా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి, గరివిడి మండలంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. తాశీల్దార్, ఎంపిడిఓ కార్యాలయాలను సందర్శించారు. పలుచోట్ల మొక్కలను నాటారు. వాటికి ప్రతిరోజూ నీరుపోసి సంరక్షించాలని సూచించారు. అనంతరం మండలంలోని తోండ్రంగి గ్రామానికి వెళ్లి, కొత్తగా నిర్మించిన ఆర్‌బికె భవనాన్ని పరిశీలించారు. రైతులతో, వ్యవసాయాధికారి సంగీతతో మాట్లాడి, పంటల పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది ప్రతీఒక్కరితో మాట్లాడారు. వారి శాఖల పరంగా పథకాల అమలు తీరుపై ప్రశ్నించారు. పెండింగ్ ధరఖాస్తులు, క్షేత్రస్థాయి సమస్యలు, జగనన్న కాలనీల నిర్మాణం, సమగ్ర సర్వే, ఇ-క్రాప్, చేయూత గ్రౌండింగ్, రేషన్ సరుకుల సరఫరా, ఫోర్టిఫైడ్ బియ్యం వినియోగంపైనా ఆరా తీశారు. వివిధ వర్గాల ప్రజలతో భేటీ అయి, వేక్సినేషన్‌పై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. సచివాలయంలో నిర్వహిస్తున్న వేక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. గ్రామ సర్పంచ్ పి.బంగారులక్ష్మితో మాట్లాడి, గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నారు. ఇంటింటి కుళాయిలు ప్రభుత్వపరంగా మంజూరు చేస్తామని, రోడ్డు నిర్మాణంలో మాత్రం గ్రామంనుంచి భాగస్వామ్యం కావాలని అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవస్థలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, వాటిని సక్రమంగా అమలు చేసే బాధ్యత వారిపైనే ఉందని స్పష్టం చేశారు. ప్రతీ పథకంపైనా పూర్తిగా అవగాహన కల్పించుకోవాలని, వాటిని అర్హులకు అందజేయాలని సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రతీఒక్కరూ వినియోగించేలా చూడాలన్నారు. ఈ బియ్యానికి అదనంగా పోషకాలను కలుపుతున్నారని, వాటిని వాడటం వల్ల రక్తహీనత నివారింపబడుతుందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ కోవిడ్ వేక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు తప్పనిసరిగా వేక్సిన్ వేయించుకోవాలని, వలంటీర్లు, ఇతర సిబ్బంది వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది అంతా సకాలంలో విధులకు హాజరై, సక్రమంగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం హౌసింగ్ కాలనీ లేఅవుట్‌ను పరిశీలించారు.
ఈ కార్యక్రమాల్లో మండల తాశీల్దార్ శివన్నారాయణ, ఎంపిడిఓ జి.భాస్కరరావు, మండల వ్యవసాయాధికారి టి.సంగీత, పిఆర్ డిఇ ఎం.శ్రీనివాసకుమార్, ఏఈ పి.చంద్రశేఖర్, హైసింగ్ ఏఈ ఎంవి రమణ, వైకెపి ఏపిఓ ఎస్.రత్నమాల, ఎపిఎం ఎల్.పద్మ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సూర్యకుమారి మందుగా గరివిడి ఫేకర్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామ్ జూనియర్ కాలేజ్, ఆర్ట్స్, అప్లయిడ్ కాలేజ్, ఫేకర్ కంటి ఆసుపత్రులను సందర్శించారు. ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఫేకర్ సిఇఓ శర్మ, డిజిఎం ఎల్.నారాయణమూర్తి, ఎజిఎం కమలాకరరావు, గరివిడి లైన్స్‌క్లబ్ గవర్నర్ టివివిఎస్ఎన్‌రాజు, ఇతర సభ్యులు, ఫేకర్ అధికారులు పాల్గొన్నారు.