అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. జగనన్న పచ్చతోరణం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సరుబుజ్జిలి మండలం పెదపాలెం గ్రామం నుండి పాలవలస గ్రామం వరకు రోడ్డుకిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాసనసభాపతి తమ్మినేని సీతారాం శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పాలవలస గ్రామం లో జగనన్న కాలనీలో ఉమ్మడి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మానస పుత్రిక అని, 31 లక్షల ఇళ్లు దేశంలో ఎక్కడా ఇప్పటి వరకు నిర్మించ లేదని అన్నారు. ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చాలా దగ్గరగా మోనిటరింగ్ చేస్తున్నారని, ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక పరిపాలనా వ్యవస్థను మెరుగు పరిచే నాయకుడికి సంపూర్ణమైన అభినందనలు తెలియజేస్తున్నానని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్థానిక నాయకులు బెవర మల్లేశ్వరరావు, కె వి జి సత్యనారాయణ, సురావరపు నాగేశ్వరరావు తదతరులు పాల్గొన్నారు.