పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కూర్మాం దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం కొత్త భవనం నిర్మాణం కాబోతోందని స్థానిక శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. శ్రీకూర్మం గ్రామ పంచాయతీలో అదిలీల ఫౌండేషన్ (న్యూఢిల్లీ) వారి ఆధ్వర్యంలో నిర్మించనున్న ధర్మ శాల నిర్మాణానికి ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూర్మనాథ ఆలయానికి సమీపంలో బస్టాండ్ దగ్గర ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని అని తెలిపారు. పితృదేవతలకు కర్మ కాండలకు అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారని, వారు వేచి ఉండడానికి సరియైన వసతి లేనందు వలన భక్తుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అదిలీల ఫౌండేషన్ యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయన్నారు. దైవ భక్తి కలిగిన ఆదినారాయణ సంకల్పం నేడు కార్య రూపం దాల్చిందన్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని మరిన్ని వసతులు మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేవస్థానం కి వచ్చే భక్తుల కోసం అన్నదానం కోసం అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోరు అనిత ఫౌండేషన్ చైర్మన్ ఎస్ ఆదినారాయణ, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, రాష్ట్ర అగ్రిమిషన్ సభ్యులు గొండు రఘురాం, మాజీ ఎఎంసి చైర్మన్ బరాటం నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ బరాటం రామశేషు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ మూర్తి, మార్పు ధర్మారావు, మాజీ సర్పంచ్ రామశేషు, తదితరులు పాల్గొన్నారు.