రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించి వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ఆర్బీకే సెంటర్ల ఏర్పాటు లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. భీమిలీ నియోజకవర్గంలోని భీమునిపట్నంలో 73.54 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. 50 లక్షలతో వ్యవసాయ మార్కెట్ నూతన కార్యాలయంకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల బాధలు అర్తం చేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గానికో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.
ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లీ ప్రపంచం అడుగులేస్తోంది. మారిన జీవన విధానం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మంచి పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరం అని అన్నారు. నియోజకవర్గంలోని 47 ఆర్బీకే సెంటర్లకుగానూ ఆగస్టు నెలాఖరుకు సగం పూర్తవ్వాలని.. దసరాకు మొత్తం ఆర్బీకే సెంటర్ల నిర్మాణం పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం జరిగితే రైతులు నష్టపోకూడదని ఈ-క్రాప్ విధానం తీసుకొచ్చి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారని అన్నారు. నియోజకవర్గంలోని రైతుల సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. రైతులకు సేవ చేస్తే.. భగవంతునికి చేసినట్టేనని మంత్రి ఈ సందర్బంగా అన్నారు.
మేయర్ హరి వెంకట కుమారి మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించేందుకు ఈ అగ్రి ల్యాబ్స్ ఉపయోగపడతాయని అన్నారు. రైతుల సంక్షేమం కోరి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు. అగ్రికల్చరల్ జాయింట్ డైరెక్టర్ లీలావతి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గస్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ స్థాపణతో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వాడుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఉన్న 627 రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సరఫరా చేస్తున్నామని అన్నారు. రైతులందరూ ఈపంటలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దాట్ల పెదబాబు, అగ్రికల్చరల్ ఏడీ, హార్టికల్చరల్ ఏడీ, జిల్లా పశుసంవర్ధక శాఖ చైర్మన్ గాడు వెంకటప్పడు, వ్యవసాయ అధికారులు, మాజీ ఎంపీపీ కొరడ వెంకటరావు, , కార్పొరేటర్లు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు, పీఏసీఎస్ అధ్యక్షులు, మూడు మండలాల సర్పంచులు, ఎంపీటీసీ అభ్యర్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.