గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటూ సచివాలయాల ద్వారా మెరుగైన, వేగవంతమైన సేవలందించాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు ఆదేశించారు. గుర్ల మండలంలో జె.సి. బుధవారం పర్యటించి పలు గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. ముందుగా కెల్ల గ్రామ సచివాలయాన్ని సందర్శించి అక్కడి సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. సిబ్బంది నిర్ణీత వేళల్లో విధులకు హాజరవుతోందీ లేనిదీ తనిఖీ చేశారు. కార్యాలయ రిజిష్టర్లను, రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు పొందేందుకు లబ్దిదారులకు వుండాల్సిన అర్హతలు, దరఖాస్తు చేసుకొనే విధానం తదితర అంశాలపై సచివాలయంలో పూర్తిస్థాయిలో సమాచారం అందుబాటులో వుంచినదీ లేనిదీ పరిశీలించారు. సిబ్బంది ఎవరెవరు ఏయే విధులు నిర్వహిస్తున్నదీ గ్రామంలో ఏ రకమైన సేవలంందించిందీ తెలుసుకున్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తులను పరిష్కరించేందుకు ఎంత సమయం తీసుకుంటున్నదీ అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దని హెచ్చరించారు.
అనంతరం ఇదే మండలంలోని కోటగండ్రేడు గ్రామ సచివాలయాన్ని జె.సి. సందర్శించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానం, వలంటీర్ల పనితీరుపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రేషన్ కార్డులు, ఇళ్లస్థలాలు, ఫించన్ల మంజూరు తదితర అంశాల్లో గడువులోగా వాటిని మంజూరు చేస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు.