గ్రామీణ ప్రాంత ప్రజలకు వారి గ్రామంలోనే వుంటూ ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ పథకాలు అందుకోవాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలను ప్రవేశపెట్టారని ఆ లక్ష్యాలు నెరవేరేలా సచివాలయ సిబ్బంది, ఆర్బీకెల సిబ్బంది చిత్తశుద్దితో కృషిచేయాలని జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.జి.సి.కిషోర్ కుమార్ పేర్కొన్నారు. సచివాలయాలు, ఆర్బీకెల ద్వారా గ్రామీణులకు ఉత్తమ సేవలు అందించే దిశగా పనిచేసి ఈ వ్యవస్థను విజయవంతం చేసే బాధ్యత సచివాలయాల సిబ్బందిపైనే వుందన్నారు. జాయింట్ కలెక్టర్(రెవిన్యూ) డా.కిషోర్ కుమార్ గురువారం మధ్యాహ్నం డెంకాడ మండలంలో విస్తృతంగా పర్యటించారు. చింతలవలస, రఘుమండ, బొడ్డవలస గ్రామాల్లో సచివాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సచివాలయాల ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆయా గ్రామాల్లోని వలంటీర్లతో మాట్లాడి తమ పరిధిలోని కుటుంబాలకు ఏవిధంగా సేవలు అందిస్తున్నదీ తెలుసుకున్నారు. ఇ-కెవైసి జరుగుతున్న తీరు, సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరును తెలుసుకున్నారు. వలంటీర్లు ప్రజలకు అందుబాటులో వున్నదీ లేనిదీ ఆరా తీశారు. ఈ పర్యటనలో మండల తహశీల్దార్ ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.