సచివాలయ సిబ్బంది ఉత్తమ సేవల ద్వారా గ్రామీణ ప్రజల అభిమానాన్ని పొందాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు హితవు పలికారు. ప్రభుత్వం సచివాలయ సిబ్బందిపైనే ఎన్నో ఆశలు పెట్టుకుందని, ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి ఎంతో మంచి ఆశయంతో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థను విజయవంతం చేసేందుకు శాయశక్తులా కృషిచేయాలన్నారు. జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు గురువారం డెంకాడ మండలంలో విస్తృతంగా పర్యటించారు. అమకాం, గొలగాం(గంట్లాం) లోని గ్రామ సచివాలయాలను, రైతుభరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సచివాలయాల ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆయా గ్రామాల్లోని సచివాలయ రికార్డులను తనిఖీ చేశారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరును తెలుసుకున్నారు. వలంటీర్లు ప్రజలకు అందుబాటులో వున్నదీ లేనిదీ ఆరా తీశారు.