ప్రత్యేక భూసంబంధ వివాదాలు, సమస్యలు ఉన్న గ్రామాల్లో తొలివిడతలోనే సమగ్ర భూసర్వే చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో త్వరగా సమస్యలు పరిష్కారం జరగాల్సిన అవసరం ఉందన్నారు. వై.ఎస్.ఆర్.జగనన్న సమగ్ర భూహక్కు, భూరక్ష పథకం అమలుపై రాష్ట్ర స్థాయి ఉపసంఘంలో సభ్యుడిగా వున్న మంత్రి బొత్స జామి మండలం విజినిగిరిలో శుక్రవారం మాట్లాడుతూ అవసరమైతే రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇనాం, మఖాసా భూములు వంటి పలు రకాల భూసంబంధ సమస్యలు ఉన్నచోట తొలివిడతలోనే సర్వే జరగాలని చెప్పారు. మంత్రి శుక్రవారం జామి మండలం విజినిగిరిలో పర్యటించారు. ఈ గ్రామంలో పలువురు మఖాసా భూముల సర్వే ఎంతోకాలంగా పెండింగులో వున్న అంశం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూర్యకుమారికి సూచనలు చేస్తూ ఈ అంశంపై తొలివిడతలో చేపట్టేందుకు ప్రతిపాదనలు చేయాలన్నారు. రాష్ట్రంలో 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందన్నారు. మన రాష్ట్రంలో చేపట్టిన తర్వాత కేంద్రం కూడా జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఇదే తరహాలో భూసర్వే చేపట్టేందుకు నిర్ణయించిందన్నారు.
గ్రామంలో రూ.40 లక్షల ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధులతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానసపుత్రిక గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ అని పేర్కొంటూ, ఈ వ్యవస్థపై ముఖ్యమంత్రి జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పనిచేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చే పనులు చేయవద్దని కోరారు. వలంటీర్లను ప్రభుత్వానికి కళ్లు, చెవులుగా ముఖ్యమంత్రి భావిస్తున్నారని వీరి పనితనంపైనే ప్రభుత్వ ప్రతిష్ట ఆధారపడి వుందన్నారు.
జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి మాట్లాడుతూ గ్రామానికి మంచి అందమైన సచివాలయ భవనాన్ని నిర్మించుకున్నారని పేర్కొంటూ గ్రామ సర్పంచ్‌ను అభినందించారు. అదే విధంగా గ్రామ ప్రజల ఆరోగ్యంపట్ల కూడా స్థానిక ప్రతినిధులు శ్రద్ధ చూపి ప్రజలంతా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. జామి మండలంలో కోవిడ్ కేసులు అధికంగా వుండటంతో పాటు వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతోందని, ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజలను వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. మూడో వేవ్ రాక ముందే జిల్లాలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలని ప్రయత్నిస్తున్నామని దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యుడు సురేష్‌బాబు తదితరులు మాట్లాడారు. ఆర్.డి.ఓ. బిహెచ్.భవానీ శంకర్, పంచాయతీరాజ్ ఎస్.ఇ. విజయ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి విజయ్ కుమార్, డివిజనల్ డెవలప్ మెంట్ అఫీసర్ రామచంద్రరావు, గ్రామ సర్పంచ్ కిలారి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి బొత్స గంట్యాడ మండలం కొర్లాంలో గ్రామ సచివాలయ భవనాన్ని, రైతుభరోసా కేంద్రాన్ని ప్రారంభించారు.