ఆ గ్రామానికి చేసిన సేవను ఆ విద్యార్ధులు ఇన్నేళ్లూ మర్చిపోలేదు..
Ens Balu
7
బాలారం
2021-08-23 14:32:28
చేసిన సేవ, చెప్పిన పాఠం, చూపిన అభిమానం, చెప్పుకోవడమే అందరూ చూసి ఉంటారు.. వాటన్నింటినీ చక్కగా ఒక మంచి గౌరవప్రధమైన కార్యక్రమం చేస్తే ఎలావుంటుందో బాలారం పూర్వవిద్యార్ధుల సంఘం చేయడం ఒక మంచి ముందడుగనే చెప్పాలి.. అవునా.. అందుకేనేమో ఆ బాలారం గ్రామానికి పండుగొచ్చింది.. డప్పువాయిద్యాలు, మేళ తాళాలు, చిన్న పిల్లల ఆటపాటలు ఎటు చూసినా కోలాహలమే.. ఏంటీ ఈ మధ్య పండుగలేం జరగలేదు కదా అనుకుంటున్నారా.. అలా అనుకుంటే కాదు.. ఆ గ్రామానికి సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఘనంగా సత్కరించుకోవడానికి విశాఖజిల్లా, కొయ్యూరు మండలం, బాలారం పూర్వవిద్యార్ధుల సంఘం ఆధ్వర్యంలో ఒక వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్ల క్రితంలో ఈ గ్రామంలో విద్యార్ధులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు, ఈ గ్రామానికి సేవ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారిని ఏరి కోరి ఈ కార్యక్రమానికి పిలిచారు. వారందరినీ(గుదే కొండలరావు, సూరిశెట్టి నాగేశ్వర్రావు, రాళ్లపల్ల కె.ఎస్.ప్రసాద్, మంత్రి ప్రగన వెంకటరావు,బోయిన ఆనందరావు, పాటిబల్ల బాల త్రిపుర సుందరి) ఒకేసారి గ్రామంలో ఊరేగిస్తూ, పూల వర్షం కురిపిస్తూ ఇక్కడి పూర్వవిద్యార్ధులు ఒక ఉత్సవంలా ఆ గ్రమంలో నిర్వహించారు. వారంతా ఒకేసారి గ్రామానికి రావడంతో ఊరంతా సంబరం చేసుకున్నారు. తమకు చదువులు చెప్పిన గురువులను, తమ పల్లెకి సేవలందించిన ప్రభుత్వ సిబ్బందిని ఎంతో మంచి మనసుతో ఘనంగా సత్కరించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమం మొత్తం అక్కడి పూర్వవిద్యార్ధుల సంఘం అధ్యక్షు నీలం జోగిరాజు ఆధ్వర్యంలో జరిగింది. విశ్రాంత ఉద్యోగులందరినీ ఘనంగా సత్కరించిన ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ఊరు జనం మొత్తం కదిలొచ్చింది. సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖలో నైనా ఉద్యోగి ఉద్యోగ విరమణ చేస్తే ఆరోజు ఒక కార్యక్రమం చేసి ఊరుకుంటారు. కానీ ఈ గ్రామంలో పనిచేసి, రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరినీ పిలిచి ఈ కార్యక్రమం చేపట్టడంతో జిల్లాలోనే ఈ కార్యక్రమం అందరినీ ఆలోచింపజేసింది. మాట అనడం ఎంత తేలికో..గ్రామానికి సేవచేసిన వారిని గుర్తుపెట్టుకొని మరీ పిలిచి సన్మానించడం అంటే ఎంతో కష్టం.. అంతటి కష్టాన్ని ఇష్టంగా చేసుకొని చేపట్టిన ఈ గ్రామస్తుల గురభక్తికి వినమ్రంగా నమస్కరించాల్సిందే కాదంటారా..!