అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి సౌకర్యాన్ని కల్పిస్తామని జిల్లాకలెక్టర్ మల్లిఖార్జున తెలిపారు. గురువారం రోలుగుంట మండలం కొండ పాలెం గ్రామం లో నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇళ్ల కాలనీలలో ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి నిరుపేద కు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇళ్ళ నిర్మాణాలను కూడా చేపడుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. నిర్మాణ పనులు వేగవంతంగా చేయాల్సిందిగా లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య ,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నదన్నారు. నాడు- నేడు కార్యక్రమానికి కోట్లాది రూపాయలను ఖర్చుచేసి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేస్తున్నదని, తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలలకు పంపించి,ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను పుచ్చు కోవాలన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బి సత్యవతి మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇల్లులేని నిరుపేద మహిళలకు గృహ నిర్మాణాలను అందిస్తున్నారన్నారు.ఈ ఘనత ఆయన కొక్కరికే దక్కుతుందన్నారు.
చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ రోలుగుంట , కొండపాలెం గ్రామాలకు చెందిన 75 మంది అర్హులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు. లబ్ధి దారులు,అధికారుల సమన్వయం తో ఆరు నెలల్లో నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో ఆర్ గోవిందరావు, రోలుగుంట తాసిల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ అధికారులు తదితరులు హాజరయ్యారు.