వర్షాలు ప్రారంభమై నందున గ్రామాలలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత నివ్వాలని సంయుక్త కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. ఆయన పద్మనాభం మండలంలో రేవిడి కృష్ణాపురం పద్మనాభం అనంతవరం గ్రామాలలో పర్యటించి సచివాలయాలను తనిఖీ చేశారు. వానలకు మురుగునీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందుతాయని ఫలితంగా మలేరియా ప్రబలే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి నీరు నిల్వ ఉండకుండా సంపూర్ణ పారిశుద్ధ్యం ప్రతిరోజూ చేస్తూ ఉండాలన్నారు. అందరూ కోవిడ్ నిబంధనలను పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సచివాలయ ఉద్యోగులందరూ సమయపాలన, బయోమెట్రిక్ తప్పనిసరిగా పాటించాలని, సంక్షేమ పథకాలకు సంబంధించిన చెల్లింపులకు రసీదులను వెంటనే పంపించాలన్నారు. వైయస్సార్ భీమాలో అర్హులందరినీ నమోదు చేయాలన్నారు. స్పందన కార్యక్రమం తప్పక నిర్వహిస్తూ ఉండాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కేంద్రాలు, ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ పర్యటనలో మండల అభివృద్ధి అధికారి జి.వి. చిట్టిరాజు, మండల ఇంజనీర్ సుధాకర్ రావు, ఈ.వో.ఆర్.డి. ఎన్. ఉషారాణి ఇతర అధికారులు పాల్గొన్నారు