శంఖవరంలో విద్యార్ధులకు అర్ధాకలి భోజనం..
Ens Balu
9
Sankhavaram
2021-09-15 14:23:43
మీకు పంపిన భోజనం చాలకపోతే ప్రక్కనే ఉన్న మోడల్ స్కూలులో ప్రతీరోజూ భోజనం మిగిలిపో తుంది.. అది అడుక్కొనితెచ్చి మీహైస్కూలులో పిల్లలకు పెట్టండి.. దానికి కంగారు పడిపోతే ఎలా.. తీసుకొచ్చిన భోజనాలు చాలకపోవడం, గ్రుడ్లు సరిపోవకపోవడం సదామామూ లేకదండీ.. విద్యాశాఖలో ఏ అధికారి పెద్దగా ఇలాంటివి పట్టించుకోరు.. ప్రతీదానికి కంగారు పడిపోతే ఎలా.. మాస్టారూ..! ఏంటి ఇవేవో విద్యాశాఖలో కాస్త పెద్ద స్థాయిలో అధికారులు అన్న మాటలనుకుంటున్నారా.. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. శంఖవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాలకు బెండపూడి నుంచి మధ్యాహ్నానం భోజనం తీసుకువచ్చే నిర్వాహకుల సిబ్బంది అన్నమాటలివి.. ఈ మాటలు అన్నది ఎవరినోకాదో.. సాక్షాత్తూ జిల్లా పరిషత్ హైస్కూలు హెచ్ఎం సూర్యనారాయణని.. ఈ రసవత్తర అర్ధాకలి మధ్యాహ్నాన భోజనం విషయాలు కాస్త తెలుసుకుంటే.. షరా మామూలుగానే బుధవారం పాఠశాలకు అరకొరగా భోజనాలు తీసుకువచ్చారు నిర్వాహకులు. అందులో పాఠశాల విద్యార్ధులు 30 మందికి భోజనాలు సరిపోలేదు. దీనితో తమ మిగిలిన పిల్లలకు భోజనాలు పంపాలని, వారిని పస్తులతో ఉంచలేమని నిర్వాహకులకు ఫోనులో కబురు పంపారు పాఠశాల హెచ్ఎం. వెంటనే(2.30 గంటలకు అప్పటి వరకూ పిల్లలు అర్ధాకలితోనే ఉన్నారు.) సిబ్బంది భోజనం తీసుకువచ్చారు. వస్తూ వస్తూనే ఇప్పటికిప్పుడు గ్రుడ్డు పెట్టలేమని, అవి ఉడికి తీసుకు రావాలంటే సమయం పట్టేస్తుందని.. కావాలంటే రేపు పంపిస్తామని మా నిర్వహాకులు చెప్పారని భోజనం తీసుకొచ్చిన సిబ్బంది చెప్పుకొచ్చారు. భోజనంగా కిచిడీ, అందులోకి బంగాలళ దుంపల కూర మాత్రమే పంపారన్నారు. భోజనాలు పెడుతూనే, మీ పాఠశాలలో పిల్లలకు భోజనాలు లేకపోయినా.. పూర్తిగా సరిపోకపోయినా ఇంతకంగారు పడిపోవడం ఏంటి మాష్టారు.. ప్రక్కనే మోడల్ స్కూలులో భోజనాలు రోజూ మిగిలిపోతున్నాయి. అక్కడి నుంచి అడుక్కుతెచ్చి మీ పిల్లలకు పెట్టొచ్చుగదా అన్నారు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన హెచ్ఎం మాకేం అంత ఖర్మపట్టలేదు. ప్రభుత్వం మా పిల్లలకు కూడా భోజనానికి డబ్బులు ఖర్చుచేస్తుంది.. భోజన నిర్వహకులకు బిల్లుల రూపంలో ఇస్తుంది. భోజనాలు చాలకపోతే సరిపడా వెంటనే తేవాలి తప్పితే మేము ఇంకో పాఠశాలకు వెళ్లి మిగిలిపోయిన భోజనాలు అడిగి తెచ్చుకోవడం ఏంటి ఇది పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పక్కనే ఉన్న మీడియా ప్రతినిధులకు విషయాన్ని చూపిస్తూ.. చూడండి ఇదీ పిల్లలకు భోజనాలు చాలడం లేదంటే ప్రక్కనే వున్న పాఠశాల నుంచి మిగిలిపోయిన భోజనాలు అడిగి తెచ్చుకోమంటారా.. ఇదేమైనా పద్దతిగా ఉందా మీరే చెప్పండి అన్నారు.. అయినా ఒక హైస్కూలు ప్రధాన ఉపాధ్యాయులతో భోజనాలు తీసుకొచ్చే సిబ్బంది ఈ విధంగా మాట్లాడం మీరే చూస్తున్నారుగా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నేను ఎంఈఓ కి ఫిర్యాదు చేస్తాను. తెచ్చిన భోజనంలో కూడా గ్రుడ్లు కూడా లేవు. అదీ భోజనం సమయం అయిపోయిన తరువాత తీసుకు వచ్చారు. 10వ తరగతి పిల్లలు కనుక భోజనాలు లేకపోయినా ఇంత సేపు ఆగారు. అదే చిన్న పిల్లల పరిస్థితి అయితే మేము ఏం చేయాలి.. వారు ఆకలి తట్టుకో లేక కళ్లు తిరిగిపడిపోతే బాధ్యత ఎవరిది అంటూ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయాన్ని నిర్వాహకులకు హెచ్ఎం వెంకటేశ్వర్ ఫోనులో తమ సిబ్బంది అన్న మాటలు తెలియజేయగా.. ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోవద్దని, మరోసారి ఇలా జరగకుండా చూస్తామని సర్ది చెప్పుకున్నారు. కాగా ఈ విషయమై ఎంఈఓ ఎస్వీరమణను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. ఫోనులో సంప్రదించినా స్పందించలేదు. ఏది ఏమైనా మధ్యాహ్నాన భోజన పథకంలో విద్యార్ధులకు తెచ్చే భోజనాలు పిల్లలకు చాలకపోతే పక్కనే ఉన్న పాఠశాలల్లో మిగిలిపోయిన భోజనాలు అడిగి తెచ్చి పెట్టాలని ఉచిత సలహాలు ఇచ్చిన నిర్వాహకుల వైఖరిని విద్యాశాఖ అధికారులు ఏ విధంగా స్వీకరిస్తారో తేలాల్సి వుంది..!