దారకొండలో అల్లూరి విగ్రహం ఆవిష్కరణ..


Ens Balu
6
Darakonda
2021-09-22 08:37:29

విశాఖ ఏజెన్సీలో రెండేళ్లకు పైగా  కొనసాగిన అల్లూరి సాయుధ పోరాటంలో గూడెం కొత్తవీధి ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉందని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు అన్నారు.  గూడెం కొత్తవీధి మండలంలోని దారకొండ ప్రాంతంలోగల దారాలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కోటనందూరుకు చెందిన అల్లూరి సీతారామరాజు సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు లక్కాకుల బాబ్జి అల్లూరి విగ్రహాన్ని అందజేయగా.. ప్రముఖ సినీనటుడు జోగి నాయుడుతోపాటు పడాల వీరభద్రరావు, మహర్షి రమణ తదితరులు అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  పడాల వీరభద్ర రావు మాట్లాడుతూ, అల్లూరి ముఖ్య అనుచరుడు గాం మల్లు దొర గూడెం కొత్తవీధి ప్రాంతంనుంచే  పార్లమెంట్‌ సభ్యుడిగా  ఎన్నికయ్యారన్నారు. విశాఖ ఏజెన్సీలో గిరిజనుల కోసం సాయుధ పోరాటం చేసిన ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు గూడెం కొత్తవీధి మండలం లోని దారకొండ, పెదవలస, దామనపల్లి తదితర ప్రాంతాల్లో సంచరించారన్నారు. దారకొండలోని దారాలమ్మ అమ్మవారు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణకు ఆరాధ్య దైవమని ఆయన నటించే ప్రతి సినిమా షూటింగ్‌కు ముందు ఒకసారి దారాలమ్మను ఆయన దర్శించుకుంటుంటారని అన్నారు. బ్రిటిష్‌ పాలన హయాంలోనే గూడెం కొత్తవీధి మండలంలో కాఫీ తోటల పెంపకం ప్రారంభమైం దని, ఇంతటి ఘన చరిత్ర గల గూడెం కొత్త వీధి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. దారాలమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ  ప్రాంతాలనుంచి ఎందరో భక్తులు వస్తూ ఉంటారని అయితే రహదారుల దుస్థితి అత్యంత దయనీయంగా ఉందని పడాల ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఏజెన్సీలో అరుకు, బొర్రా గృహాలు ప్రాంతాలకు ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం అదే విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు, చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల్లోని పలు దర్శనీయ ప్రాంతాలను కూడా అభివృద్ధిచేసి పర్యాటకంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  శ్రీ అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ  సంఘం అధ్యక్షురాలు శ్యామలా వరలక్ష్మి, దారకొండ సర్పంచ్‌ నడిగట్ల రాజు, ఆలయ ప్రధాన అర్చకుడు సాగిన నారాయణమూర్తి, దివ్య అర్చకుడు కంకిపాటి ప్రసాద్‌, దార్లపూడి రాము, ఎమ్‌.నాగేశ్వరావు, జి.గణేశ్వరరావు, కోటనందూరు అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ  ప్రతినిధులు   కొంకిపూడి ప్రసాద్‌, దాడి లోవరాజు, తోలెం సత్తిబాబు, బొడ్డేటి స్వామి, బుద్ద చెల్లారావు, లక్కాకుల ధనుంజయ, గజ్జెలపు జయప్రకాష్‌, మళ్ళ తాతాజీ, మామిడి ఏసుబాబు, అనకాపల్లి వెంకటరమరణ, మళ్ళ లక్ష్మణ, చింతాకుల వెంకటేష్‌, అంకారెడ్డి రాజశేషు, గొంప వరహాలబాబు, కొంకిపూడి శ్రీను, దాడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు