పిల్లలూ నేనూ మీతో కలిసి భోజనం తినొచ్చా..
Ens Balu
5
Chodavaram
2021-09-24 12:40:57
అన్నం రుచిగా ఉంటుందా..ఇంట్లో వండినట్టే వుంటుందా..రోజూ బాగా భోజనం చేస్తున్నారా..ఈ రోజు నాకు మీతోపాటు భోజనం పెడతారమరి.. నేనూ మీతో కలిసి తినొచ్చా..ఈ మాటలన్నీ అన్నది ఎవరో కాదు..విశాఖ జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున. నిరుపేదల కోసం బాగా తెలిసిన సిసలైన అధికారి. వాస్తవాలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించే డేరింగ్ అండ్ డేషింగ్ ఐఏఎస్. ఈయన తలచుకుంటే స్టార్ హోటల్లో భోజనం చేయొచ్చు కానీ.. నిరుపేద పిల్లలకు ప్రభుత్వం అందించే భోజనాన్ని కలిసి తింటే ఆ చిన్నారుల్లో ఎంతో స్పూర్తినింపిన వారవుతారు. దానికోసం జిల్లాకి కలెక్టర్ అయినప్పటికీ ఆ విద్యార్ధులతోనే నేలపై కూర్చొని మరీ భోజనం చేశారు. ఈ సంఘటన చోడవరం మండలం గోవాడలో చోటు చేసుకుంది. శుక్రవారం నాడు –నేడు పథకంలో భాగంగా పంచాయితీ భవన నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ పిల్లలతో మాట్లాడారు. అదే విధంగా జెడ్ పి ఉన్నత పాఠశాల మరియు ఎం .పి.పి. మెయిన్ ఎలిమెంటరీ స్కూల్ సందర్శించి జగనన్న విద్యాకానుక కిట్ ను పరిశీలించారు. అన్ని సక్రమంగా అందినవి లేనివి అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులతో కలిసి మధ్యాహ్న బోజనం చేసారు. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నది లేనిది ఆరా తీసారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది ఖాళీల వివరాలను అడిగారు. నాడు – నేడు పనులను పరిశీలించారు. పాఠశాలలో టాయిలెట్స్, నిరంతర నీటి సౌకర్యం ఉన్నది, లేనిది పరిశీలించారు. హైస్కూల్ లో 10వ తరగతి వరకు మాత్రమే ఉన్నదని, ఇంటర్ మీడియట్ వరకు అప్ గ్రేడ్ చేయాలని విద్యార్ధులు కోరగా పరిశీలించి ప్రభుత్వానికి తెలియజేస్తామని కలెక్టర్ తెలిపారు.