ప్రతీ గ్రామంలో కోవిడ్ వేక్సినేషన్ శతశాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖ సిబ్బందితోపాటు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు వేక్సినేషన్‌పై దృష్టి పెట్టి, పూర్తి చేయాలని ఆదేశించారు. జామి మండలంలో ఆమె గురువారం విస్తృతంగా పర్యటించారు. తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. గులాబ్ తుఫాను కారణంగా వివిధ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పరిశీలించారు. రామయ్యపాలెంలో రైతులతో కలెక్టర్ మాట్లాడారు. పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర సమస్యలపై ప్రశ్నించారు. ఏయే పంటలు, ఎంతమేరకు నష్టపోయినదీ ఆరా తీశారు. దెబ్బతిన్న పంటల వివరాలను ప్రభుత్వానికి నివేదించి, నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.
లొట్లపల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిష్టర్‌ను, ప్రభుత్వ పథకాల ప్రచారాన్ని పరిశీలించారు. బయోమెట్రిక్ అటెండెన్స్‌లో లోపాలను గమనించారు. సచివాలయ సిబ్బంది అంతా తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని ఆదేశించారు. ప్రజలనుంచి అందే వినతులపై ఎప్పటికప్పుడు స్పందించాలని, పెండింగ్ లేకుండా పరిష్కరించాలని సూచించారు. గ్రామంలో 18 ఏళ్లు పైబడిన ప్రతీఒక్కరికీ కోవిడ్ వేక్సిన్ వేయాలని, శతశాతం పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం అక్కడి రైతు భరోసా కేంద్రాన్ని తనిఖీ చేశారు. వ్యవసాయ సిబ్బందితో మాట్లాడి, గ్రామంలోని పంటల పరిస్థితిని వాకబు చేశారు. పశుసంవర్థకశాఖ సిబ్బందితో మాట్లాడి, అక్కడి పాడిసంపద గురించి వివరాలు అడిగారు. రైతులతో భేటీ అయ్యారు. ఎరువులు, విత్తనాల సరఫరా, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ప్రతీఒక్కరూ వేక్సిన్ వేసుకోవాలని రైతులను కోరారు.
అనంతరం అలమండ గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్‌పై ఆరా తీశారు. వేక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతీఒక్కరికీ వేక్సిన్ వేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో తాశీల్దార్ బి.నీలకంఠరావు, మండల వ్యవసాయాధికారి పి.కిరణ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.