కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రతీ రోజు వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎల్ గౌరీ. అన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ నర్సీపట్నం పాతబజార్ వీధిలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో గౌరీ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధరలను 500 రూపాయలకు పైగా పెంచిందన్నారు. గ్యాస్‌తో పాటు నిత్యవసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ అన్నిరకాల ధరలను పెంచుతుందన్నారు. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని లేకుంటే మహిళలు తగిన బుద్ధి చెబుతారని ఆమె అన్నారు. అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచి పెట్టుబడిదారులకు లబ్ధి చేకూరుస్తుందని ఆమె అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజలను వంచించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. అన్ని రకాల ప్రభుత్వ రంగ పరిశ్రమలను పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తుందని మోడీ చర్యలను వ్యతిరేకించకపోతే దేశాన్ని అమ్మేస్తారన్నారు. గ్యాస్ ధరలు తగ్గించుకుంటే మహిళలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని మోడీని ఇంటికి పంపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మంగ, రమణమ్మ, లక్ష్మివెంకటమ్మ, దుర్గగోవిందమ్మ, రాజేశ్వరి పాల్గొన్నారు.