విజయనగరంజిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రెండో విడత వై.ఎస్.ఆర్.ఆసరా సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. బలిజిపేటలో జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అలజంగి జోగారావు పాల్గొని మండలంలోని మహిళా స్వయంశక్తి సంఘాలకు రెండో విడత ఆసరా మొత్తాలను అందజేశారు. మండలంలోని 1315 సంఘాలకు రూ.7.62 కోట్ల మొత్తానికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న అందిస్తున్న ఈ సహాయాన్ని వినియోగించుకొని రానున్న రోజుల్లో మహిళా సంఘాలు మరింతగా ఆర్ధిక వృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అలజంగి రవికుమార్, ఎంపిపి గుడివాడ నాగమణి, వైస్ ఎంపిపి బెవర హేమలత, మండల ప్రత్యేకాధికారి, పశుసంవర్ధక శాఖ డి.డి. కె.మురళీకృష్ణ, ఎంపిడిఓ పి.దేవకుమార్, తహశీల్దార్ రఫీజాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంశక్తి మహిళలతో కలసి ఎమ్మెల్యే జోగారావు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.