గిరిజనుల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని పాడేరు శాసనసభ్యురాలు కె. భాగ్యలక్ష్మి అన్నారు. ఐటీడీఏ, ఆరోగ్యశ్రీ సంయుక్తంగా మండలంలోని నిర్మతి ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగావైద్య శిబిరాన్ని ఐటీడీఏ పి ఓ రోణంకి గోపాలకృష్ణ తో కలిసి గురువారం ప్రాంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులు ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో వైద్య సదుపాయాలు లేని మారు మూల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.రాష్టం లోని అతి పెద్ద పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిపుణులైన వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని చెప్పారు.వైద్య శిబిరాలపై స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలక్రిష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనలు మేరకు ఏజెన్సీలో 15 రోజులకు ఒక మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటివరకు అరకు నియోజకవర్గ పరిధిలోని రెండు, పాడేరు నియోజకవర్గంలో పెదవలస, నుర్మతి మెగావైద్య శిబిరాలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. 12వేల మందికి వైద్యం అందించామన్నారు. స్త్రీల వైద్య నిపుణులు, చిన్న పిల్లలు, చెవి ముక్కు గొంతు వైద్యులు, కంటి,చర్మ, జనరల్ వైద్యనిపుణులు, ఎముకలు, కీళ్ల వైద్యు నిపుణులు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఐటీడీఏ నుంచి ఉచితంగా మందులు, రవాణా సౌకర్యం, తాగునీటి సదుపాయాలు,భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఏజెన్సీలో 4.30లక్షల మందికి కోవిడ్ వాక్సినేషన్ వేయడం జరిగిందన్నారు. ఇంకా లక్ష మందికి కోవిడ్ టీకాలు వేయాలని అన్నారు. జిల్లా ఆసుపత్రిలో చిన్న పిల్లలు, స్త్రీల వైద్య నిపుణులను నియమించామని చెప్పారు. అనేస్థీషియా వైద్యుల పోస్టు ను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. అంతకు ముందు వివిధ విభాగాలలో పర్యటించి రోగులతో మాట్లాడారు. మందులు సక్రమంగా వినియోగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాడేరు మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు ఎం.గాయత్రి దేవి, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా.రాజేష్, అదనపు జిల్లా వైద్యాధికారి డా.లీలప్రసాద్, ఎంపిడిఓ వెంకన్నబాబు, తహసీల్దార్ చిరంజీవి పడాల్,ఏటీడబ్ల్యుఓ క్రాంతి ,పలువురు వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.