హిందీ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం వుంది..


Ens Balu
2
New Delhi
2020-09-14 20:26:33

హిందీభాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని.. అలాగని ఏ భాషనూ ఎవరిపైనా రుద్దాల్సిన అవసరం లేదని, ఏ భాషనైనా వ్యతిరేకించడం సరికాదని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘వివిధ భాషలు, వివిధ ఆచారాలున్నా భారతదేశమంతా ఒక్కటే. మనమంతా ఒక్కటే. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ విశిష్టత’ ఈ సాంస్కృతిక గొప్పదనాన్ని కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సోమవారం హిందీ దివస్ సందర్భంగా మధుబన్ విద్యాసంబంధిత ప్రచురణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాల సమావేశంలో ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ఎవరి మాతృభాషను వారు నేర్చుకుంటూనే మరో భారతీయ భాషను కూడా నేర్చుకోవాలని సూచించారు. ఆ తర్వాత పరాయి భాషలను నేర్చుకోవడంలో తప్పులేదన్నారు. ఎన్ని ఎక్కువ భాషలొస్తే అంత ప్రగతి సాధించేందుకు వీలవుతుందన్నారు. హిందీ మాతృభాషగా ఉన్నవారు దక్షిణాది రాష్ట్రాల్లోని భాషలను నేర్చుకోవాలి. హిందీయేతర రాష్ట్రాలవారు హిందీని నేర్చుకోవాలి. ఇతర భాషలోని పదాలను, సామెతలను నేర్చుకుంటుంటే.. ఆ భాష మాట్లాడే వారితో ప్రేమానురాగాలు పెంచుకోవడంతోపాటు సత్సంబంధాలు ఏర్పడతాయి. దేశ సమైక్యత సుదృఢం అవుతుంది’ అని ఉపరాష్ట్రపతి  సూచించారు. కరోనా సమయంలో తాను ఫోన్లో పలకరించిన వారికి, తనతో మాట్లాడిన వారికి.. తమది కాని మరో భారతీయ భాషను నేర్చుకోవాలని సూచించానన్నారు. ముఖ్యంగా పిల్లలు హిందీ, ఇతర భారతీయ భాషలు నేర్చుకోవాలని చెప్పానన్నారు.