నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని.. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవత్సవాన్ని అంటాడో సినీ కవి.. ప్రశ్నిస్తూ ప్రపంచాన్ని తన వార్తలతో ఆలోచింపజేసే జర్నలిస్టులు తమ కోసం మాత్రం తాము రాసుకోలేకపోతున్నారు. సమాజంలో నాల్గవ మూలస్థం జీవం కోల్పోతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. జర్నలిస్టులు పడుతున్న బాధలు, పడుతు ఇబ్బందులు, ఎదుర్కొంటున్న సమస్యలు రాయాలని ఉన్నా.. యాజమాన్యాలు రాయనివ్వవు. పైకి పల్లకీ మోత..లోన అప్పుల రోత అన్న సామెత సరిగ్గా సరిపోతుందేమో వర్కింగ్ జర్నలిస్టులకి. మీరు జర్నలిస్టు అయితే.. ఈ వార్త చదవుతున్న సమయంలో నిజమే నా విషయంలోనూ ఇలా జరిగిందని అనుకుంటారు. కాదు కాదు జరిగే వుంటుంది. పత్రికల్లో, టీవిల్లో ఎవరికోసమో రాసిన వార్త అచ్చు అయితే, చేసిన స్టోరీ బ్రాడ్ కాస్ట్ అయితే ఆనంద పడే జర్నలిస్టులు.. వారి సమస్యలను మాత్రం కనీసం ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లలేకపోతున్నారు.
చచ్చీ చెడీ జర్నలిస్టుల సంఘాల ద్వారా ఆందోళనలు చేసి, మీకోసం లో అర్జీలు పెట్టినా.. యదారాజా తదా ప్రజా అన్నట్టుగా అధికారులు కూడా సదరు దరఖాస్తులను ప్రక్కన పెట్టేస్తున్నారు. నేటికీ 60శాతం మంది జర్నలిస్టులు వారంలో ఒక రోజు కుటుంబ సమేతంగా పస్తులుంటున్నారంటే అతిశకయోక్తి కాదేమో. ప్రస్తుతం ఆంగ్ల పత్రికలు, కొన్ని ప్రధాన టీవి ఛానళ్లు, రెండు మూడు పెద్ద దినపత్రికలు తప్పితే మరే ఇతర యాజమాన్యాలూ పత్రికల్లో పనిచేసే విలేఖరులకు జీతాలు ఇవ్వడం లేదు సరికదా.. కనీసం లైన్ అకౌంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రైవేటు ప్రకటనలు చేస్తే వాటిపై ఇచ్చే కమిషన్లు తప్పా. దాని కోసం జర్నలిస్టు గొడ్డులా కష్టపడాల్సి వస్తున్నది. చీమల దండు సినిమాలో నా రక్తంతో నడుపుతాను రిక్షాను.. నా రక్తమే నా రిక్షకు పెట్రోలు అని ఆర్.నారాయణమూర్తి పాడినట్టు. జర్నలిస్టుల రక్తమాంసాలతోనే పత్రికలు, ఛానళ్లు నడుస్తున్నాయి. చచ్చీ చెడి జర్నలిస్టులు పస్తులుండి కూడా యాజమాన్యాలను పెంచి పోషించాల్సి వస్తున్నది.
అదే జర్నలిస్టే యాజమాన్యాలపై రోత పుట్టి తానే పత్రిక ప్రారంభిస్తే.. భార్య మెడలో పుస్తెలు అమ్మి అయినా పత్రికను అచ్చువేయాల్సిన పరిస్థితి. ఇవేమీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టవు.. జర్నలిస్టులకి ఎక్కడ మేలు జరిగిపోతుందోనని కంగారు పడి 50శాతం రాయితీ తో ఇచ్చే రైల్వే పాసుని తీసేసింది కేంద్రం. మరెక్కడ జర్నలిస్టులు ప్రమాదంలో మృత్యువాత పడితే కుటుంబానికి ఆశరా వస్తుందోనని యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్సే ఇవ్వడం మానేసింది రాష్ట్రం. అంతేకాదు రాజకీయ పలుకుబడి.. కుల పెత్తనం ముసుగులలో పెద్దపత్రికలకి ఇచ్చే ప్రకటనల్లో కనీసం దశమ భాగం కూడా ప్రభుత్వాలుగానీ, ప్రైవేటు సంస్థలుగానీ స్థానిక పత్రికలకు, చిన్న మధ్య తరహా పత్రికలకు ఇవ్వడం లేదు. ఆ సమయంలో నిజంగా వర్కింగ్ జర్నలిస్టు రక్తం అమ్ముకొనైనా పత్రికను నడిపించాల్సిన పరిస్థితి వస్తోంది. లేదంటే ఇంట్లో బియ్యం లేకపోయినా.. చేసిన యాడ్స్ కి బలవంతంగా తన సొంత డబ్బులు యాజమాన్యానికి కడితే తప్పా మనుగడ లేని పరిస్థితి.
జర్నలిస్టుగా పనిచేస్తున్నందుకు ప్రభుత్వం సమయానికి అక్రిడిటేషన్ ఇవ్వదు.. హెల్త్ కార్డు ఇవ్వదు.. యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ ఇవ్వదు, కనీసం సొంత గూడు నిర్మించుకోవడానికి ఓ మూడు సెంట్ల స్థలం కూడా ఇవ్వదు. ఇవన్నీ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. ఈ విషయంలో నిరుపేదలకిచ్చే నిబంధనలు కూడా జర్నలిస్టుల కోసం సడలించి ఆలోచించడం లేదు ప్రామాణికంగా తీసుకోవడం లేదు. కానీ తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి దయ్యాలు తిరిగే వరకూ ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా దానిని వెలుగులోకి తీసుకు వచ్చేది ఒక్క విలేఖరి మాత్రమే. రాజకీయపార్టీలు ప్రభుత్వాన్ని స్థాపించాలన్నా, స్థాపించిన ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు వరకూ వెళ్లాలన్నా మళ్లీ జర్నలిస్టులు కావాలి. కానీ జర్నలిస్టుల కనీస అవసరాలు, ప్రధాన సమస్యలు మాత్రం ప్రభుత్వాలు తీర్చవు. సాధారణ ప్రజల మాదిరిగానే అధికారులకు, ప్రజాప్రతినిధులకు అర్జీలు పెట్టుకోకా తప్పదు.
ఇక్కడ కూడా మళ్లీ సిగ్గులేనిది జర్నలిస్టులకే.. ప్రభుత్వం జర్నలిస్టుల కనీస అవసరాలు తీర్చకపోయినా.. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకూ ప్రభుత్వం, అందులోని నాయకులు, అధికారులు ఏం చేశారనే విషయాలను ప్రజలకు అందరికంటే ముందుగా చూపించాలనే తపన మాత్రం ఉంటుంది. అదే తపన తాను కట్టుకున్న భార్యను, పిల్లలను సక్రమంగా చూసుకోవాలనే ఆలోచనను కూడా ప్రక్కన పెట్టేలా చేస్తుంది ఈ విలేఖరి ఉద్యోగం. ఇపుడు నేను చెప్పిన అంశాలన్నీ ప్రతీ ఒక్క జర్నలిస్టు విషయంలోనూ జరిగేవే.. అయినా మళ్లీ ఈరోజు పేపర్ వాళ్లు ఎందుకు గుర్తుచేస్తున్నట్టో అంటే..అందరూ జర్నలిస్టులూ వారి కోసం వాళ్లు రాసుకునేంత తీరిక, సమయం వారికి లేవని.. ఉన్న కొద్దిపాటి సమయం మాకు దొరికిందని.. వారికి వారి సమస్యలేంటో తెలియజెప్పే చిన్న ప్రయత్నం మాత్రమే.
జర్నలిస్టులు ఎన్ని వార్తలు రాసినా ప్రభుత్వంలోనూ ప్రజాప్రతినిధుల్లోనూ చలనం ఏ విధంగా అయితే రాదో.. ఇలాంటి వార్తలు వచ్చినా.. జర్నలిస్టుల్లోనూ ఆ విధంగానే మార్పు రాదని చెప్పడానికి కూడా పనిచేస్తుందని... అసలు జర్నలిస్టుకి కనీసం ఉపయోగపడని వారికోసం జర్నలిస్టులు ఎందుకు పనిచేస్తాడంటే సమాజంలోని నాల్గవ మూల స్థంబంగా గౌరవం ఇచ్చినందుకు. కానీ నేడు అదే సమాజం జర్నలిస్టుకి కనీస గౌరవం ఇవ్వడం లేదు. దానికి కారణం కూడా అరకొర పనితనం, ప్రెస్ కార్డు అడ్డం పెట్టుకొని చేస్తున్నదందాలు, వేధింపులు, ఇలా చెప్పుకుంటూ పోతే జర్నలిస్టు అనే నాణేనికి ఒకవైపు జర్నలిస్టులు చేసే అరాచకాలు కూడా లేకపోలేదు.
ఒక వైపు సమాజాన్ని మేల్కొలపాలని పనిచేసే నికార్శైన వర్కింగ్ జర్నలిస్టులుంటే.. మరోవైపు యూనియర్లు పేరుతోనూ, పత్రికల పేరుతోనూ, కులం పేరుతోనూ జర్నలిజాన్ని బ్రష్టు పట్టించేవారూ లేకపోలేదు. ఎన్ని ఉన్నా.. ఏం చేసినా.. విలేఖరి కలం మాత్రం తన గోడుని రాసుకోని దినంగానే మిగిలిపోతున్నది..అయినా కూడా జర్నలిజం వర్ధిల్లాలి.. జర్నలిస్టుల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి.. జర్నలిస్టుల వార్తలతో సమాజం మేల్కోవాలి.. ప్రజలు చైతన్యవంతం కావాలి..!?