దేశ సరిహద్దుకి సైనికులు.. సమాజానికి జర్నలిస్టులే రక్షణ..?!


Ens Balu
37
visakhapatnam
2025-07-11 04:40:13

దేశ రక్షణకు సరిహద్దుల్లో భారత సైనికులు.. సమాజాన్ని తమ వార్తలతో మేల్కొలపడానికి వర్కింగ్ జర్నలిస్టులు లేకపోతే ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. పాకిస్తాన్ లాంటి దాయాది దేశాలు గుంటనక్కల్లా దేశంపై దాడి చేసిన సమయంలో భారత సైన్యం వారిని సునాయాశంగా తిప్పికొట్టింది. ఆ విషయాన్ని యావత్ మీడియా బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. అంటే ప్రపంచంలో ఏ మూలన ఏం  జరుగుతున్నా తాజా సమాచారాన్ని సేకరించి దానిని ప్రపంచానికి తెలియజేసేది కేవలం జర్నలిస్టు మాత్రమే. సొసైటీలో ఫోర్త్ పిల్లర్ గా ఉన్న జర్నలిస్టులు వహించే నైతిక బాధ్యత, దేశ సంరక్షణ సైనికులతోపాటు సమానంగా జర్నలిస్టులూ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా సరిద్దుల్లో చొరబాటు దారులకు భారత సైనికులు సింహ స్వప్నమైతే.. సమాజంలో అవినీతి పరులకు మీడియా, జర్నలిస్టులంటే భయం వణుకు. జర్నలిస్టు లేకపోతే అత్యంత భారీ కుంభకోణం భోఫోర్స్, టుజీ స్కాములు బయటకి వచ్చే పరిస్థితి ఉండేదా..? సరిహద్దుల్లో భారత సైనికులు వీరోచితంగా పోరాడకపోతే పాకిస్తాన్ డ్రోన్ వ్యవస్థను ఇండియన్ ఆర్మీ తుక్కు తుక్కుగా నాశనం చేయగలిగేదా..? అవన్నీఊహలకే అందని వాస్తవాలు. 

నేడు దేశ ప్రజలు గుండెలపై చేయి వేసుకొని ప్రశాంతంగా నిదురపోగలుగుతున్నారంటే గణన తలంలో వాయుసే.. సముద్రంపై నౌకసే.. నేలపై ఆర్మీ ఇలా త్రివిధ దళాలు కంటిమీద కునుకు లేకుండా దేశానికి రక్షణ వలయంగా కాపుకాస్తున్నాయి. వీరి విజయగాధలను వీరోచిత యుద్దాలను, త్రిప్పికొట్టే దాడులను బాహ్య ప్రపంచానికి తెలియజేసేది కేవలం జర్నలిస్టులు మాత్రమే. భారత దేశ ఆయుధ సంపత్తి, శక్తి సామర్ధ్యాలు, సైనిక బలం, అత్యాధునిక టెక్నాలజీ ఇలా సమస్త వివరాలు ప్రపంచ దేశాలకు తెలియడానికి ఒకే ఒక్క కారణం జర్నలిస్టు. సైనికుడు తుపాకీతో దేశానికి పహారా కాస్తే.. జర్నలిస్టులు తన పదునైన కలంతో సమాజానికి రక్షణ వలయంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వాలు నడిపేది పాలకులైతే.. వారు ఎలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారో ప్రజలకు తెలియజేసది మాత్రం వర్కింగ్ జర్నలిస్టులు. విచిత్రం ఏంటంటే దేశ రక్షణకు పాటు పడిన సైనికుడితో సమానంగా గౌరవం ఉన్నా నేటికీ 70శాతం మంది జర్నలిస్టులకు నేటి సమాజంలో రక్షణ లేకుండా పోతున్నది. దేశ సరిహద్దుల్లో సైనికులతోపాటు యుద్దాలను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులు కూడా అసువులు బాసిన సందర్భాలు ఉన్నాయి. 

బయట వాస్తవాలను తెలియజేస్తున్నందుకు దుండగులు జర్నలిస్టులపై చేస్తున్న దాడులు ఎక్కువైపోయాయి. సైనికులకు ప్రభుత్వం జీతం ఇస్తున్నట్టుగా మీడియా యాజమాన్యాలుు మాత్రం జర్నలిస్టులకు అంతగా జీతాలు ఇవ్వడం లేదు. కొందరు జర్నలిస్టులు పస్తులుండి కూడా సమాజకోసం పనిచేస్తున్న సందర్భాలూ లేకపోలేదు. రాను రాను ఉద్యోగ భద్రతలేని మీడియా రంగంలోకి రావడానికి యువత వెనుకడుగు వేస్తున్నారు. అందునా సోషల్ మీడియా ప్రాభవం బాగా పెరిగిపోవడం కూడా దీనికి కారణం అవుతున్నది. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న మీడియా సంస్థలు..అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జర్నలిస్టులకు తగ్గుతున్న ఆదరణ కూడా దానికి కారణం అవుతున్నాయి. అలాగని అన్ని మీడియా సంస్థల పరిస్థితీ ఒకేలా ఉందని అనుకోవడానికీ లేదు. ప్రభుత్వాలకి అనుకూలంగా, కుల బలం ఉన్న మీడియా పరిస్థితి ఒకలా ఉంటే విలువలు, ప్రజలు, సమాజం దేశం కోసం ఆలోచించి పనిచేస్తున్న మీడియా సంస్థల పరిస్థితి మరో ఉంటోంది. దేశంలో గూఢచార సంస్థలు చేసే స్ట్రింగ్ ఆపరేషన్ల కంటే పది రెట్ట నెట్వర్క్ తో సేకరించిన సమాచారాన్ని జర్నలిస్టులు మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేయగలుగుతున్నారు. 

ఇంతచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు కార్డు(అక్రిడిటేషన్లకు) ఎక్కడా లేని నిబంధనలు పెట్టి మీడియాను నియంత్రించే చర్యలకు ప్రభుత్వాలు పూనుకోవడం దారుణం. కనీసం జర్నలిస్టులకోసం పలా సంక్షేమ పథకం ఉందని చెప్పడానికి కూడా ఒక్క పథకం కూడా లేకపోవడం మరింత దారుణం. జర్నలిస్టులు లేకపోతే పరిస్థితి తలకిందులవుతుందని తెలిసినా కూడా  ప్రభుత్వాలు కఠిన చర్యలు అవలంభిస్తున్నాయి. అయినా మొక్కవోని దీక్షతో జర్నలిస్టులు పనిచేస్తూనే ఉన్నారు. కొన్ని మీడియా సంస్థలు విలువలకు కట్టుబడి అదే ప్రభుత్వాల కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు చేసే సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జర్నలిస్టులు ఉపయోపడిన దానిలో దశమభాగం మీడియాకి ప్రభుత్వాలు ఉపయోగ పడటం లేదనేది వాస్తం. సమాజంలో ఫోర్త్ పిల్లర్ గా, కలం అనే ఆయుధంతో సమాజానికి కాపలా  కాస్తున్న జర్నలిస్టులను పరిస్థితి మారాలి. వారి ఆర్ధిక అభివృద్ధి జరగాలి. కూడు, గూడు విషయంలో ప్రభుత్వం నుంచి సహకారం అందాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు జర్నలిస్టులను గుర్తించాలి. 

జర్నలిస్టులు కూడా మనుషులే వారికంటూ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వాల్లో రావాలి. సమాజాన్ని మేల్కొలపడానికి జీవితాలను ధారపోస్తున్న జర్నలిస్టుకు వారి చివరి రోజుల్లోనైనా కనీసం కొద్దిపాటి పెన్షన్ సౌకర్యం కల్పించి ఆదుకుంటే.. మీడియా రంగంలోకి కూడా కొత్త రక్తం రావడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే రానున్న రోజుల్లో పూర్తిగా మీడియా ప్రజలను పాలిస్తున్న పాలకులే వారి సొంత సిబ్బందితో నడుపుకోవాలి.. ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చేసింది. అది నిజంగా దేశానికి కూడా ప్రమాదం. ఈ విషయాన్ని పాలకులు గుర్తించాలి. దేశ రక్షణకు సైనికులు ఎంత అవసరమో సమాజ రక్షణకు జర్నలిస్టులూ అంతే అవసరమని ప్రభుత్వాలు గుర్తించాలి. దేశ సరిహద్దుల్లో కంటిమీద కునుకు లేకుండా పహారా కాస్తున్న భారత సైనికులూ మీకు వందనాలు.. సమాజాన్ని తమ వార్తలతో చైతన్యం తీసుకువస్తున్న  వర్కింగ్ జర్నలిస్టులూ మీకు జేజేలు. జర్నలిజం వర్థిల్లాలి..!