జర్నలిజం అంటే ఎప్పుడు..ఎక్కడ.. ఎందుకు.. ఏమిటి.. ఎలా..అనే వివరాలతో చక్కని వార్తా కథనాలు ఉండేవి. సాంకేతిక విప్లవంతో పురుడు పోసుసుకున్న సోషల్ మీడియా రంగ ప్రవేశంతో ఇపుడంతా కాపీ, పేస్ట్ జర్నలిజం అయిపోయింది. ఒకడు రాసిన వార్తనే వాట్సప్, టెలీగ్రామ్, మెయిల్, ఫేస్ బుక్, వెబ్ సైట్ ఇలా ఎక్కడ దొరికితే అక్కడ నుంచి కంటెంట్ ను కాపీ పేస్టు జర్నలిజం చేస్తున్నారు నయా జర్నలిస్టులు. ఒకప్పుడు జర్నలిస్టు అంటే వార్తలు రాయడం సీనియర్ల వెనుక కొన్ని నెలలు తిరిగితే వచ్చేది కాదు.. అదీ కూడా సీనియర్లు దయతలచి రాయడం నేర్పిస్తే తప్పా. ఇపుడు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ బాగా విస్తరించిన తరువాత అసలైన జర్నలిజానికి నూకలు చెల్లాయి. రాసేవారు కొద్దిమందే అయితే.. దానిని కాపీ పేస్టు చేసే వందల మంది అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు ఆ వార్త రాసారో కనుక్కోవడానికి కూడా కుదరడం లేదు. కాస్తో, కూస్తో చదువుకున్నవారు.. జర్నలిస్టుల కోసం తెలిసిన వారు, జర్నలిజం ఫీల్డులో వర్కింగ్ జర్నలిస్టులుగా పనిచేస్తున్నవారు అయితేనే ఈ రకమైన వార్తలు పలానా జర్నలిస్టు మాత్రమే రాస్తాడని, ఆపేపర్ లోనే తరచుగా వస్తాయని చెబుతున్నారు తప్పితే మిగిలినవారు ఆ విధంగా కూడా గుర్తు పట్టలేని దుస్తితి.
ప్రస్తుతం జర్నలిస్టులు రాయడం మానేసి ఎత్తిపోతలు అవలంభిస్తున్నారు. ఒకడు రాసిన వార్తకి, స్టోరీకీ కిందా పైనా కాస్త మార్పులు, చేర్పులు చేసి తోసేస్తున్నారు అదీ వార్తలు, దానిని రాయడంపై అవగాహన ఉన్నవారు అయితేనే. అదే కాపీ, పేస్టు జర్నలిస్టులైతే ఒకటే మూస..ఒకటే.. దెబ్బ.. అక్కడ కాపీ చేశామా.. ఇక్కడ పేస్టు కొట్టామా.. మన డేట్ లైన్ పెట్టామా..అంతే.. ఒక్కోసారి కొన్ని కొన్ని వెబ్ సైట్లలో వార్త అడుగున వచ్చే ‘ముఖ్య మైన గమనిక ఈ వార్త కే కేవలం వార్త రాసిని వారి ఆలోచన మేరకే అని వుంటుంది ’ అదికూడా చెరపకుండా వార్తలోపెట్టేస్తున్నారంటే నేటి సోషల్ మీడియా జర్నలిజం ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు. ఒక మరో రకం జర్నలిస్టులున్నారు..వాళ్లతై వారి స్వామి భక్తిని చాటుకోవడానికి వార్తలో కూడా మంచి పదాల అల్లికను వినియోగిస్తుంటారు.. ‘శ్రీశ్రీశ్రీ మా పెద్ద పనోడు గారు’.. అంటూ మొదలెడతారు.. అక్కడికి వీళ్లేదో గ్రామ దేవతలు, దేవుళ్ల పేర్లతో వార్తలు రాసినట్టు ముందు ‘శ్రీ,’ తారు వాత ‘గారు’అని రాస్తే.. ఆ కాపీ పేస్టు చేసుకున్న జర్నలిస్టు కానీ జర్నలిస్టుకైనా బుద్దుండాలి కదా.. వాడూ అలాగే వచ్చింది వచ్చినట్టు కాపీ పేస్టు చేస్తేస్తాడు. అక్కడితో ఊరుకుంటారా.. దానిని తీసుకెళ్లి ఆ డిటిపి ఆపరేటర్ మొహాన పడేదస్తారు.. వాడు కూడా ఏమీ పట్టించుకోకుండా సదరు పత్రికలో అదేవిధంగా డిజైన్ చేసేస్తాడు.
ఒక పోతే పదాల పైత్యపు ప్రయోగం మరీ విచిత్రంగా వుంటుంది. ‘శ్రీశ్రీశ్రీ ఎమ్మెల్యేగారి చేతులు మీదుగా అవార్డు స్వీకరించారు’ అంటే పాపం కాళ్ల మీదుగా ఇస్తే బాగోదని కాబోలు.. ఇలా రాసినపుడు ‘ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే తన కాళ్లపై తానే నిలబడ్డాడరు’.. ‘ఆ సమావేశంలో పాల్గొని తన కంటితోనే ప్రజలను చూస్తూ.. తన నోటితోనే మాట్లాడారని.. తన దానితో పి....తా...అని కూడా రాయాలి కదా మరి’ అంటే మాత్రం ఈ జర్నలిస్టుకి మనిషికి వచ్చినంత కోపం వస్తుంది. ఇక మూడో రకం జర్నలిస్టు రాసే రాతలు చదివిన వారికి.. కాస్త భాషపై పట్టున్నవారికి అ పదాలు కలలోకి వచ్చేస్తుంటాయి.. ఆ కార్యక్రమం ‘ఆ విధంగా జరగడం జరిగింది..’ అంటూ మొదలెడతారు.. అసలు అ విధంగా జరగడం జరగిందేమిటో.. రాసినోడికి.. ఆ వార్తలు పత్రికా కార్యాలయంలో చదివి దిద్ది పేజీలు పెట్టే సబ్ ఎడిటరు, పత్రిక నిర్వాహకులకే తెలియాలి. ఈ పద ప్రయోగం జర్నలిస్టులే కాదు.. సమాచార పౌర సంబంధాలశాఖ విడుదల చేసే పత్రికా ప్రకటనల్లోనూ కొన్ని జిల్లాల నుంచి ఈ విధంగానే వస్తుండం దారుణం.
ఇక వార్తలు రాయడం రాని జర్నలిస్టులు ఇదే సమాచారశాఖ ఇచ్చే ప్రెస్ నోటు క్రింద.. ‘ఈ ప్రకటన జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ నుంచి జారీచేయడమైనది’ అనే చివరి లైనుని కూడా ఒక్క అక్షరం కూడా తీయకుండా వార్తల్లో పెట్టి ప్రచురించేసే మహానుభావులు కూడా ఉన్నారు. పైగా ఒక పత్రిక నుంచి కాపీ పేస్టు చేసుకునే వార్తల్లో వినియోగించే డేట్ లైన్లను కూడా తీయకుండా మక్కీకి మక్కీ కాపీ పేస్టు చేసి మరీ వారి వారి పత్రికల్లో పెట్టేస్తుండటాన్ని బట్టి పత్రికలపై కూడా సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకడు వాడేసిన ఎంగిలి పదాలు కూడా మరో పేపరు వాడు, ఇంకో టీవి ఛానల్ వాడూ తెగ వాడేస్తున్నారు సిగ్గూ శరం లేకుండా.. అలా ఎంగిలి పదాలు వాడే సమయంలో పలాన పత్రికవాడి భాష కదా ఇది అనిపిస్తుంటుందంటున్నా నిజంగా వార్తలు రాసే జర్నలిస్టులు. అందులోనూ ఒకడు వాడుతున్నది.. పదే పదే వాడేసిన పదాలు మళ్లీ మళ్లీ వీడూ కాపీ, పేస్టుగా వాడుతున్నాడంటే మార్పు ఎవరిలో రావాలో కూడా తెలియని పరిస్థితి.
ఉదా హరణకు ‘తెలుగుదేశం పార్టీ అనే పదాన్ని షార్ట్ కట్ లో తెదెపా అని రాసిన వాడు’.. ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని వైసీపీ అని రాస్తాడు.. వాస్తవానికి అలా షార్ట్ కట్ లో వైఎస్సార్సీపీ అవ్వాలి కదా.. మరి వైసీపీ అని ఎందుకు రాస్తున్నారంటే.. వైఎస్సార్ అనే పదం డా.వైఎస్సార్ ని పోలివుంటుందని.. దానిని పదే పదే వాడి పత్రికలోనూ, టీవీ ఛానల్ లోనూ ఉచ్చరించడం ఇష్టం లేక సదరు పత్రిక, టివి ఛానల్ ‘వైసీపీ’ అని రాసేస్తున్నారు. దానిని మిగిలిన ప్రధాన మీడియా సంస్థలు, టీవీ ఛానళ్లు కూడా కాపీ పేస్టులా వాడేస్తున్నాయి. సాధారణంగా ఒక మీడియా సంస్థకి గుర్తింపు రావాలంటే వారికంటూ ఒక పద ప్రయోగ విధానాన్ని అలవాటు చేసుకుంటారు. తద్వారా అలాంటి పదాలు, ఇలాంటి వార్తలు వాళ్ల మీడియాలోనే వస్తాయని. కనీసం ఈ సాంకేతిక విషయాన్ని కూడా మిగిలిన మీడియా సంస్థలు కనీసం గుర్తించకపోవడం అత్యంత శోచనీయం. పేరు మోసిన పత్రికలు, టీవీ ఛానళ్లు కూడా ఇదే పద ప్రయోగాన్ని అవలంభించడం కూడా దేనికి సంకేతమో తెలియని పరిస్థితి.
ఒకప్పుడు పత్రికా భాష, టీవి పద ప్రయోగం అంటూ ఒక విధానం ఉండేవి. అవి ఇపుడు బూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనపించడం లేదు. అసలు పత్రికా భాషపోయి వారి సొంత భాషలు వచ్చాయి. కనీసం వాడుక పదాలతోనైనా వార్తలు వస్తే చూడాలని ఉందనుకునే వారికి సోషల్ మీడియా మోకాలడ్డుతోంది. ఒకప్పుడు ఒక చిన్న వార్త రాయాలంటే రెండు మూడు తెల్లకాగితాలైనా వేస్టు అయ్యేవి. ఇపుడా పరిస్థితి లేదు. ఒకడు స్క్రిప్టు పెడితే అక్షరం పొల్లుపోకుండా అన్ని పత్రికలు, టీవి ఛానళ్లు, లోకల్ కేబుల్ టివి ఛానళ్లు వాళ్లు అదే వాడేస్తున్నారు. ఇక్కడ సమయం చాలకపోవడం ఒక సమస్య అయితే.. మళ్లీ ఆ వార్త కోసం ప్రత్యేకించి రాయడం ఎందుకు అనుకునేవాళ్లే ఎక్కువంది మంది ఉంటున్నారు. దీనిని బట్టి జర్నలిజంపై కాపీ పేస్టు ప్రభావం ఏ స్థాయిలో ఉందో అలా జరగడం జరిగినపుడైనా శ్రీశ్రీ శ్రీ పెద్ద పనోడైన కాపీపేస్టు జర్నలిస్టు ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే చదివే పాఠకుడి కళ్లల్లో నుంచి రుధిర జ్వాల కారడం ఖాయం..!?