విప్లవాగ్ని అల్లూరి అన్యధా భావించకు..!


Ens Balu
19
visakhapatnam
2025-07-03 21:58:51

భరతమాత దాశ్య శృంఖలాలను తెంచేందుకు తృణ ప్రాయంగా ప్రాణాలు అర్పించిన ఓ ధీరుడా.. తెల్లవాడిని భారత దేశం నుంచి తరిమికొట్టి.. స్వాంత్ర్య ఉద్యమంలో తెలుగువాడీ వాణిని వినిపించిన వీరుడా.. భారతీయులను బానిసలుగా చేయబోయిన బ్రీటీషువాడికి తెలుగుజాతి పౌరుషాన్ని రుచి చూపించిన సూరుడా.. మన్యంలో మహోదయం సృష్టించిన విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజా మమ్మల్ని మణ్ణించు.. మేము చేసే తప్పులను చూసి జాలిపడు.. నీ పుట్టిన రోజు జూన్ 4న నిన్ను అధికార లాంఛనాలతో కీర్తించడం.. నీ మరణాన్ని వీరత్వానికి ప్రతీకగా కొలిచి నిన్ను పూజించడం తప్పా ఏమీ చేయలేకపోతున్నాం. అధికారులుగా.. ప్రజా ప్రతినిధులుగా.. ఎంపీలుగా.. ఎమ్మెల్యేలుగా..ఎమ్మెల్సీలుగా.. ఆఖరికి కేంద్ర మంత్రులుగా ఉండి కూడా మిమ్మల్నిప్రచారం కోసం పూజించడం తప్పా మరేమీ చేయలేని నిశ్శాహయస్థితి భారతీయులం. బరి తెగించి ఇలా మాట్లాడుతున్నామని మాత్రం అన్యధా బావించకు.. మేమింతే.. మాలో మార్పురాదు.. మిమ్మల్ని గుర్తించం సరికదా.. గుర్తింపు తీసుకు వచ్చేందుకు కూడా కనీసం ప్రయత్నం చేయము.. కాదు కాదు.. తీసుకురాము.. రాలేము... చేతనైనే పరలోకం నుంచే మమ్మల్ని శపించు.. అదీ కుదరకపోతే వీళ్లింతేనని క్షమించు.. కానీ మేము ప్రతీ విషయానికి మీ పేరుతో, మీ పోరాట పటిమతో మాకు అనుకూలంగా  అనూహ్య ప్రచారానికి మిమ్మల్ని వాడుకుంటున్నామని మాత్రం గుర్తించు..జోహార్ అల్లూరి సీతారామరాజా..జోహార్..!

అవును మీరు చదువుతున్నది నిజమో కాదో ఒక్కసారి భారతీయులుగా ఆలోచించండి.. మీలో మీరు ప్రశ్నించుకోండి.. అవకాశం వస్తే ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే ప్రయత్నం చేయండి. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆడితే పిలిచి ఆ క్రీడాకారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు కోట్లాది రూపాయల ప్రైజ్ మనీ, మంచి ఇల్లు కట్టుకునేందుకు ఇంటి స్థలం. ఇంకా అవసరం అయితే అకాడమీలు ఏర్పాటు చేసేందుకు ఉచితంగానే ఎకరాలకు ఎకరాలు భూమి ఇస్తున్న  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. స్వాతంత్ర్యం కోసం.. బ్రీటీషువాడి కాలిక్రింద నలిగిపోతున్న అమాయక గిరిజనులను కాపాడేందుకు అత్యంత పిన్నవవయస్సులో భరతమాత కోసం తన ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు కి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏమివ్వాలి. ఆయన పుట్టిన రోజు, వర్ధంతి రోజున ఘనంగా అధికారికంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే అల్లూరికి సచిత స్థానం ఇచ్చినట్టా..? ఒక్కసారి ఆలోచించాల్సిన  సమయం వచ్చింది... అల్లూరి జన్మించి నేటికి 128 ఏళ్లు పూర్తవుతుంది. గత 2024కి ఆయన మరణించి 100ఏళ్లు దాటింది.

 ప్రపంచం గర్వించ దగ్గ వీరుడికి  ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుచేసిందేమిటో చూసుకుంటే.. ఆయనను కీర్తిస్తూ ప్రచారం చేసుకోవడం, అక్కడక్కడా విగ్రహాలు ఏర్పాటు చేయడం తప్పా మరేమీ చేయలేదు. కనీసం ఆ మహానుభావుని విగ్రహాన్ని పార్లమెంటులో  మాత్రం పెట్టించలేకపోయిన మన పార్లమెంటు సభ్యులను ఏమనుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. ఇదేదో కావాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను తప్పుబట్టడం కాదు. దేశ చరిత్రలో ఒక పేజీలో ఇమిడి ఉండాల్సిన అల్లూరి వీరోచిత చరిత్ర కనీసం నేటికీ పాఠ్యాంశంగా కూడా నోచుకోలేదు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, ఎయిర్ పోర్టులకు అల్లూరి పేరు పెట్టినంత మాత్రన ఆయనను గుర్తించి ఇచ్చినట్టా..? భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి విశాఖ జిల్లా, గొలుగొండ మండలం క్రిష్ణదేవీపేట గ్రామం వేదికగాబ్రిటీషు సేనలపై అల్లూరి తిరుగుబాటు చేసిన మన్యం పితూరి ఉద్యమం ఎంత మందికి తెలుసు.. 

ఆ ఉద్యమంలో మరెంత మంది అల్లూరి కంటే ముందు అసువులు బాసారో ఇంకెంత మందికి తెలుసు.. అల్లూరి వెంట నడిచిన, ఆయనతో నర్సీపట్నం జైలులో ఖైదు చేయబడిన వీరుల కోసం ఈ కధనం చదువుతున్న మీకైనా తెలుసా.. అంతెందుకు బ్రిటీషువాడిని ఎదిరించే సమయంలో ఆయన తిరిగిన ప్రదేశాలు ఏమేమిటో నేటికీ ఎవరికీ తెలియదు. ఆయన పుట్టుక, మరణం, కుటుంబం కోసం తప్పితే ఇంకేమీ దేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే ఎవరికీ తెలియదు. భూమి ఉన్నంత కాలం ఆయనను గుర్తుంచుకోవాల్సిన మనం, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆయన కోసం ఏం చేశారని ఒక్కసారి ప్రశ్నిస్తే.. 100ఏళ్లుగా కీర్తించి ఆహా, ఓహో అల్లూరి అంత.. అల్లూరి ఇంత ధీరుడు, సూరుడు, అని కీర్తించడం తప్పితే ఆయన పేరు, చరిత్ర గుర్తిండిపోయేలా ఒక రూపే నాణెం కూడా ముద్రించుకోలేకపోయాం. ఆయన చరిత్రను భావి తరాలకు తెలిసే విధంగా అధికారికంగా అధ్యయనం చేయించలేకపోయాం.. బ్రిటీషువాడి వెన్నులో చలి పుట్టించిన ఆయన వినియోగించిన విల్లుని, భాణాన్ని భావి  భారత ప్రజలకు చూపించలేపోయాం. అల్లూరి వెంట నడిచిన అనుచరులను గుర్తించలేకపోయాం..

 అల్లూరి చరిత్ర చిరస్థాయిగా నిలిచి ఉండిపోయేలా కనీసం ఒక చిన్న మ్యూజియం కూడా నిర్మించుకోలేకపోయాం.. కానీ అల్లూరికి చెందిన సామాజిక వర్గంగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగా.. ప్రజాప్రతినిధులుగా.. ఆయన జనన, మరణాల రోజున మాత్రం ఆయన విగ్రహాలకు దండలు వేసి, దండం పెట్టి.. ఆయనను కీర్తిస్తున్నాము.. ఇపుడు అల్లూరి ఆశయ సాధనే ఈరోజు దినపత్రిక, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రాస్తున్న కథనాలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియకుండానే ఉన్నాయా అంటే.. అన్నీ తెలుసు.. కానీ.. అల్లూరికి అంత విలువ ఇవ్వాల్సిన పనిలేదని ఇప్పటి వరకూ అలానే వదిలేనట్టుగా పక్కన పెట్టేశారు. అందుకే నేటికీ అల్లూరి సముచిత స్థానం దక్కలేదనేది జగమెరిగిన సత్యం. అల్లూరి మన్యం పితూరి ఉద్యమంలో, తెల్లవాడికి సమాంతరంగా ఏర్పాటు చేసిన రచ్చబండ పరిపాలనకు సాక్ష్యాలుగా  క్రిష్ణదేవిపేటలో, నేటికి అక్కడ రచ్చబండలపై అల్లూరి స్వయంగా కూర్చొని పంచాయతీలు చేసిన రాళ్లు ఉన్నాయి. 

కనీసం వాటిని కూడా భారతదేశంలో స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఏర్పాటైన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు ఎంత మంది ఆ గ్రామాన్ని సందర్శించి, ఆయన వీరోచిత చరిత్రకు గుర్తుగా ఏమైనా చేశారా అంటే.. చారిత్రక గ్రామంలో మన్యం పితూరి ఉద్యమ చరిత్రను తెలియజేసే బోర్డు సైతం పెట్టించలేకపోయాయంటే అతిశయోక్తి కాదేమో. అల్లూరి జయంతి, వర్ధంతి ఈ రెండురోజులు తప్పా.. మళ్లీ అల్లూరిని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పట్టించుకుంటే ఒట్టు. కాకపోతే గత టిడిపి ప్రభుత్వంలో ఎంపీగా పనిచేసిన దుంపా మేరీ విజయకుమారి పుణ్యమాని తన ఎంపీ నిధులతో క్రిష్ణదేవీపేట(ఏజెన్సీ లక్ష్మీపురం) లో అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరుడు గాం గంటందొర పార్థీవ శరీరాలను  ఖననం చేసిన చోట మాత్రం ఒక పార్కుని నిర్మించారు. చాలా ఏళ్ల తరువాత మళ్లీ ఇపుడు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చొరవ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

 నేడు రాష్ట్రప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని కూడా జరుపుతున్నారు. ప్రతీ జయంతికీ అల్లూరి కోసం శాస్వతంగా ఏదైనా నిలిచి ఉండే పనులు చేస్తారా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా.. నాటికీ ఏనాటికీ రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఆ చొరవ తీసుకోకపోడాన్ని బట్టి అల్లూరికి ఏస్థానం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా ఎవరినో ఉద్దేశ్య పూర్వకంగా తప్పుపట్టడానికి కాదు.. కేవలం అల్లూరికి ఇన్నేళ్లైనా సముచిత స్థానం దక్కలేదని బాధాతత్ప హృదయాలతో మననం చేసుకోవడం తప్పా.. క్షమించు మన్యవీరా క్షమించు.. జోహార్ విప్లవజ్యోతి అల్లూరి జోహార్.. జోహార్..!

-అల్లూరి సీతారామరాజుకి సముచిత స్థానం కల్పించాలి
అల్లూరి సీతారామరాజుకి చరిత్రలో నిలిచి ఉండిపోయేలా సముచిత స్థానం కల్పించాలి. దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన చరిత్రపైనా, ఉద్యమాలపై, పోరాటాలపైనా అధికారికంగా అధ్యయం చేయించాలి. ఆయన విల్లును, యుద్దంలో వినియోగించిన ఆయుధాలను సేకరించి మ్యూజియంలో పెట్టాలి. అల్లూరి మన్యం పితూరి ఉద్యమం, రచ్చబండల ఉద్యమ సమయం, పోలీసు స్టేషన్లపై దాడి చేసిన సమయంలో తిరిగిన అన్ని ప్రాంతాలను ఒక టూరిజం ప్రాజెక్టుగా రూపొందించాలి. అల్లూరి కాంశ్య విగ్రహాన్ని భారత పార్లమెంట్ లో ప్రతిష్టించి, ఆయన పేరుతో రూపే నాణేన్ని ముద్రించాలి.. అల్లూరి చరిత్రను కేజీ నుంచి పీజీ వరకూ పాఠ్యాంశంగా చేర్చాలి. అల్లూరి మన్యం పితూరి, రచ్చబండ పంచాయతీలు ప్రారంభించిన క్రిష్ణదేవిపేట(పాతూరు) గ్రామాన్ని పర్యాటకప్రాంతంగా అభివృద్ధి చేయాలి. అల్లూరి గిరిజనులకు చేసిన ఆయుర్వేద వైద్యానికి గుర్తుగా  ఈ గ్రామంలో ఆయుష్ శాఖ తరపున ఆయుర్వేద డిస్పెన్సిరీ ఏర్పాటు చేయాలి. అల్లూరి అనుచరులు, కుటుంబాల వివరాలను సేకరించి, అల్లూరి చరిత్రతోపాటు, వారి చరిత్రను కూడా బాహ్య ప్రపంచానికి తెలియజేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలు, యూనివర్శిటీల్లో చదువుల్లో అల్లూరి అనుచరుల కుటుంబాలకు ప్రత్యేక కోటాను ఏర్పాటు చేయాలి. అల్లూరి చరిత్రను అధ్యయనం చేస్తున్న పరిశోధకులకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించేందుకు ప్రత్యేక విభాగాన్ని లేదా కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలి. క్రిష్ణదేవీపేటలోని అల్లూరి పార్కుని మరింతగా అభివృద్ధి చేసి పర్యాటకశాఖలో విలీనం చేసి చారిత్రక ప్రాంతంగా గుర్తింపు తీసుకు రావాలి. తద్వారా భరతమాత కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానాన్ని కల్పించినట్టు అవుతుంది.

-పి.బాలభాను(ఈరోజు బాలు), అల్లూరి చరిత్ర పరిశోధకులు,
అల్లూరి అనుచరుడు, అల్లూరితో జైలుకెళ్లిన పందిరి రామస్వామి ముని మనవడు